అణు రంగంలో ప్రైవేట్ భాగస్యామాన్ని అనుమతించే సస్టెయినబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ బిల్లుకు ఇటీవల రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారని కేంద్రం తాజాగా ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ బిల్లు పౌర అణు రంగాన్ని నియంత్రించే ప్రస్తుత చట్టాలన్నింటినీ విలీనం చేయడం సహా ప్రైవేట్ భాగస్వామ్యానికి మార్గం సుగమం చేయనుంది. దీంతో దేశంలో అణు అభివృద్ధికి అడ్డంకిగా ఉన్నాయని కేంద్రం భావిస్తోన్న 1962 నాటి అణుశక్తి చట్టం, 2010 నాటి అణు బాధ్యత సంబంధిత చట్టాలు రద్దయాయి. కొత్త చట్టం ప్రకారం.. ప్రైవేట్ కంపెనీలు సహా జాయింట్ వెంచర్లుప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా నూతన అణు విద్యుత్ ప్లాంట్లను నిర్మించవచ్చు. అంతేకాకుండా వాటిని నిర్వహించుకునే వెసులుబాటు సహా సొంతం చేసుకునే లేదా తొలగించే అవకాశం కూడా ఉంటుంది. అయితే.. వ్యూహాత్మక, సున్నితమైన కార్యకలాపాలు మాత్రం రాష్ట్ర నియంత్రణలోనే ఉంటాయనే విషయాన్ని ఈ బిల్లు స్పష్టం చేస్తుంది. యురేనియం, థోరియం వంటి తవ్వకాలు, ఐసోటోపిక్ విభజన, పునరుత్పాదక ఇంధనాలు, అధిక స్థాయి రేడియోధార్మిక వ్యర్థాల నిర్వహణ, భారీ నీటి ఉత్పత్తిని కేంద్ర ప్రభుత్వం లేదా ప్రభుత్వ యాజమాన్య సంస్థలు నిర్వహిస్తాయి. ఈ శాంతి బిల్లు అమలు దేశ పౌర అణు వ్యవస్థలో కీలక భూమిక పోషించనుంది. ప్రభుత్వం.. అణు ఇంధనానికి సంబంధించిన కీలక అంశాలను నియంత్రిస్తూనే విద్యుత్ ఉత్పత్తికి ప్రైవేట్ భాగస్వామ్యం కల్పించేందుకు వీలుంటుంది. ఈ బిల్లు ద్వారా.. ప్రైవేట్ రంగాలు సహా యువతకు అనేక అవకాశాలు కల్పిస్తాయని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన విషయం తెలిసిందే.
0 Comments