Ad Code

కష్టకాలం నుంచి ఇండిగో బయటపడ్డాం : ఉద్యోగులకు సీఈఓ పీటర్ ఎల్బర్స్ వీడియో సందేశం


ఇండిగో ఎయిర్‌లైన్స్ సీఈఓ పీటర్ ఎల్బర్స్ ఉద్యోగులకు వీడియో సందేశాన్ని పంపించారు. కష్టకాలం నుంచి ఇండిగో బయటపడిందని పీటర్ ఎల్బర్స్ అన్నారు. సంస్థ తన నెట్‌వర్క్‌ను పునరుద్ధరించగలిగిందని చెప్పారు. ప్రస్తుతం రోజుకు సుమారు 2,200 ఫ్లైట్‌లను నిర్వహిస్తోందన్నారు. ఉద్యోగుల సమిష్టి కృషి, క్రమశిక్షణకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ తుపాను నుంచి సగర్వంగా బయటపడ్డామని అన్నారు. పైలట్‌లు, విమాన సిబ్బంది, ఎయిర్‌పోర్టు స్టాఫ్, కస్టమర్ సర్వీసు తదితర విభాగాల సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. డిసెంబర్ 9 నాటికే పరిస్థితులు చక్కబడుతున్న విషయాన్ని తాను గతంలో ప్రస్తావించినట్టు సీఈఓ తెలిపారు. ఆ తరువాత సంస్థ తన షెడ్యూల్‌ను పునర్‌నిర్మించుకుందని అన్నారు. సంస్థను మరింత దృఢంగా తీర్చిదిద్దడంతో పాటు సమస్యకు కారణాలు అన్వేషించడమే తమ ముందున్న లక్ష్యమని తెలిపారు. పలు కారణాలు ఒక్కసారిగా ముంచుకురావడంతో సమస్య తీవ్ర రూపం దాల్చిందని చెప్పారు. ఉద్యోగులు సంయమనంతో ఉండాలని, సమస్యకు గల కారణాలపై వదంతులకు తావులేకుండా తమ బాధ్యతలపై దృష్టి సారించాలని సూచించారు. ఫ్లైట్‌ల రద్దుకు గల కారణాలను తేల్చేందుకు విదేశీ నిపుణుడిని రంగంలోకి దింపిన విషయాన్ని కూడా సీఈఓ పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలను ఇతర ఎయిర్‌లైన్స్‌లు కూడా ఎదుర్కొన్నాయని, వాటి నుంచి కొన్ని విషయాలను నేర్చుకోవచ్చని అభిప్రాయపడ్డారు. తాను ఇతర ఉన్నతాధికారులతో కలిసి వివిధ విభాగాల ఉద్యోగులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటానని అన్నారు. ఇటీవలి సంక్షోభానికి కూడా కారణాలను విశ్లేషించి సంస్థను మరింత బలోపేతం చేస్తామని అన్నారు. 19 ఏళ్లుగా దిగ్విజయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ ట్రాక్ రికార్డును ఇటీవలి ఒకే ఒక సంక్షోభం కారణంగా నిర్వచించలేమని అన్నారు. కాబట్టి, ఉద్యోగులు ధైర్యంగా ముందడుగు వేయాలని సూచించారు.

Post a Comment

0 Comments

Close Menu