Ad Code

వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతాను : విరాట్ కోహ్లీ


టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతానని చేశాడు. టెస్ట్ ఫార్మాట్‌లోకి పునరాగమనం చేస్తాడనే ఊహాగానాలను కోహ్లీ కొట్టిపారేసాడు. సౌతాఫ్రికాతో రాంచీ వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో కోహ్లీ అద్భుత శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన కోహ్లీ మ్యాచ్ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కష్టమైన సాధనను తాను నమ్మనని, మానసికంగా బలంగా ఉండటంపైనే దృష్టిపెడుతానని తెలిపాడు. 'ఈ రోజు రాణించడం చాలా సంతోషంగా ఉంది. పిచ్ తొలి 25 ఓవర్లు ఒకలా తర్వాత మరోలా ప్రవర్తించింది. దాంతో బంతి కోసం వేచి చూసి ఆడాలని నిర్ణయించుకున్నా. అందుకు తగినట్టుగానే నా ఆటను మార్చుకున్నా. మిగతా విషయాల గురించి ఎక్కువగా ఆలోచించలేదు. నావైపు వచ్చే బంతిని మాత్రమే ఆడాలనుకున్నాను. ఈ మ్యాచ్‌లో క్రికెట్‌ను ఆస్వాదిస్తూ ఆడాను. నా అనుభవం కూడా ఉపయోగపడింది. నేను ఎప్పుడూ కష్టమైన సాధనను నమ్మను. మానసికంగా బలంగా ఉండటంపైనే ఫోకస్ పెడుతాను. మానసికంగా నేను ఆటను ఆడగలనని అనిపించినంత కాలం.. శారీరకంగా చాలా కష్టపడుతాను. దీనికి క్రికెట్‌తో ఏ మాత్రం సంబంధం లేదు. ఇదే నా లైఫ్ స్టైల్. నా ఫిట్‌నెస్ విషయంలో ఎలాంటి సమస్య లేదు. మానసికంగా దృఢంగా ఉంటే అద్భుతంగా ఆడేయవచ్చు. పరుగులు చేయాలనే దాహం నాలో ఇంకా ఉంది. నేను జట్టు కోసం 120 శాతం శ్రమిస్తాను. రాంచీ పిచ్ పరిస్థితులను అర్థం చేసుకోవడానికే ముందుగా వచ్చాను. పగటి పూట రెండు సెషన్లు, సాయంత్రం ఒక సెషన్ నెట్స్‌లో బ్యాటింగ్ చేశాను. ఆటకు ముందు ఒక రోజు విశ్రాంతి తీసుకున్నాను. నాకు 37 ఏళ్లు. కాబట్టి నేను రికవరీని కూడా చూసుకోవాలి. ఇప్పటికీ ప్రతీ మ్యాచ్‌కు ముందు రోజు.. ఆటకు సంబంధించి నా మదిలోనే విజువలైజ్ చేసుకుంటా. అందులోకి బౌలర్లు, ఫీల్డర్లు అందరూ వస్తారు. బౌలర్లు, ఫీల్డర్లను లక్ష్యంగా చేసుకొని నేను ఆడే తీరును ఊహించుకుంటా. అప్పుడే నేను మంచి స్థితిలో ఉన్నానని భావిస్తాను. అప్పుడే కాస్త రిలాక్స్ అయి ఆడగలను. నేను ఒక ఫార్మాట్‌లోనే ఆడుతా. గత 16 ఏళ్లుగా దాదాపు 300 పైగా వన్డేలు ఆడా. బంతితో నేనెప్పుడూ టచ్‌లోనే ఉన్నా. ప్రాక్టీస్ సమయంలోనూ హిట్టింగ్ చేయడంపై ఫోకస్ పెడతా. నెట్స్‌లో నిర్విరామంగా రెండు గంటల పాటు ప్రాక్టీస్ చేస్తే ఆ ప్రభావం తప్పకుండా మ్యాచ్‌లో ఆటతీరుపై పడుతుంది. ఆడుతూ ఉంటే ఫామ్‌లోకి రావడం పెద్ద కష్టమేం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఉన్న అనుభవం మొత్తాన్ని వినియోగించాల్సిన అవసరం ఉంది. నేనెప్పుడూ శారీరకంగా ఫిట్‌గా ఉంటా. మానసికంగా సిద్దమై మ్యాచ్‌లు ఆడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తుంటా. ఇప్పుడు రాంచీలోనూ అదే ఆటతీరును ప్రదర్శించా'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

Post a Comment

0 Comments

Close Menu