Ad Code

రూ.8.10 కోట్ల ఆన్‌లైన్ మోసం : సెక్యూరిటీ గార్డు రివాల్వర్ తో కడుపులో కాల్చుకున్న పంజాబ్ మాజీ ఐపీఎస్ అధికారి


పంజాబ్ మాజీ ఐపీఎస్ అధికారి, రాష్ట్ర మాజీ ఐజీ అమర్ సింగ్ చాహల్ సోమవారం సెక్యూరిటీ గార్డు రివాల్వర్ ఉపయోగించి తనను తాను కడుపులో కాల్చుకున్నారు. సంఘటనా స్థలం నుండి 12 పేజీల సూసైడ్‌ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పాటియాలా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వరుణ్ శర్మ తెలియజేశారు. పంజాబ్‌లోని పాటియాలాలో చాహల్‌ ఆత్మహత్యాయత్నం విషయం తమ దృష్టికి రాగానే పోలీసు బృందాలు అతని నివాసానికి చేరుకుని, ఆయనను ఆస్పత్రిలో చేర్చినట్టు ప్రకటించారు. ప్రస్తుతం చాహెల్‌ పరిస్థితి విషమంగా ఉందని, ఆయనను కాపాడేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సంఘటనా స్థలం నుండి ఒక సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్లు, అందులో చాహల్ ఆర్థిక మోసానికి గురయ్యాడని రాసి ఉంది. ఈ మేరకు చాహల్ పంజాబ్ పోలీస్ డీజీపీ గౌరవ్ యాదవ్‌ను ఉద్దేశించి 12 పేజీల సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. ఆ నోట్‌లో రూ.8.10 కోట్ల విలువైన ఆన్‌లైన్ మోసం కేసు గురించి ప్రస్తావించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆన్‌లైన్ మోసం, తీవ్రమైన ఆర్థిక నష్టాలతో ఒత్తిడికి గురైనట్టు సూసైడ్ నోట్‌లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. చాహల్ ఐజీ పదవి నుండి పదవీ విరమణ చేసినప్పటి నుండి పాటియాలాలో నివసిస్తున్నారు. కాగా 2015లో ఫరీద్‌కోట్‌లో జరిగిన బెహ్బాల్ కలాన్, కోట్కాపుర కాల్పుల కేసు నిందితుల్లో అమర్ సింగ్ చాహల్ కూడా ఒకరు. 2023, ఫిబ్రవరిలో, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎల్.కె. యాదవ్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అమర్ సింగ్ చాహల్‌తో సహా పలువురు సీనియర్ పంజాబ్ అధికారులపై ఫరీద్‌కోట్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. గతంలో కూడా సీనియర్ పోలీసు అధికారి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. హర్యానాలోని సీనియర్ పోలీసు అధికారి వై. పురాన్ కుమార్ చండీగఢ్‌లోని తన నివాసంలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన ఆత్మహత్యకు డీజీపీ, ఏడీజీసీ ఎస్పీతో సహా 10 మంది అధికారులను నిందిస్తూ ఆయన ఎనిమిది పేజీల సూసైడ్ నోట్ రాసిన సంగతి తెలిసిందే.

Post a Comment

0 Comments

Close Menu