మహారాష్ట్రంలోని రాలేగావ్ సిద్ధిలో లోకాయుక్త చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే జనవరి 30వ తేదీన నిరాహారదీక్ష చేపట్టనున్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందని ఆయన ఆరోపించారు. ప్రజా సంక్షేమానికి ఈ చట్టం చాలా కీలకమని, అయితే పదే పదే హామీలు ఇచ్చినప్పటికీ దానిని విస్మరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా తాను నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు 88 ఏళ్ల హజారే తెలిపారు. ఇప్పుడు తాను చేపట్టే నిరాహార దీక్షయే తన ఆఖరి నిరసన అవుతుందేమోనని ఆయన అభిప్రాయపడ్డారు. లోకాయుక్త చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నా హజారే 2022లో తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలో నిరాహార దీక్ష చేశారు. లోకాయుక్తను అమలు చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో నిరసనను ఉపసంహరించుకున్నట్టు గుర్తుచేశారు. ఆ తర్వాత ఓ కమిటీ చట్టాన్ని రూపొందించింది. ఈ బిల్లును మహారాష్ట్ర శాసనసభలోని ఉభయ సభలు ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపాయి. అయితే ఈ చట్టం ఇంకా క్షేత్రస్థాయిలో అమలు కాలేదని అన్నాహజారే పేర్కొన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి ఫడణవీస్‌కు తాను ఏడు లేఖలు రాసినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తాను నిరసన చేపడుతున్నట్లు తెలిపారు.
0 Comments