Ad Code

జీహెచ్‌ఎంసీలో 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్


హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్ లోపల, వెలుపల, ఓఆర్‌ఆర్‌ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ (మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు)ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి చట్టబద్ధత లభించింది. ఇటీవల కేబినెట్​ ఆమోదించి పంపిన ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ జిష్ణుదేవ్​ వర్మ ఆమోదముద్ర వేశారు. దీంతో పరిపాలనా సౌలభ్యం కోసం, నగర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం తలపెట్టిన 'హైదరాబాద్ మెగా సిటీ' ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. రాజ్‌భవన్ నుంచి ఫైలు ప్రభుత్వానికి చేరడంతో, పరిపాలనా పరమైన తదుపరి చర్యలకు మున్సిపల్ శాఖ సన్నద్ధమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధమైంది. రేపోమాపో అధికారికంగా గెజిట్ వెలువడే చాన్స్​ ఉంది. గెజిట్ విడుదలైన మరుక్షణం నుంచే ఈ 27 మున్సిపాలిటీల విలీన ప్రక్రియ అమల్లోకి వస్తుంది. ఆయా మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఉన్న కమిషనర్లు, ఇతర సిబ్బందిని జీహెచ్‌ఎంసీ పరిపాలనా విభాగంలోకి ఎలా విలీనం చేయాలన్న దానిపై ఇప్పటికే మున్సిపల్ శాఖ కసరత్తు పూర్తి చేసింది. ఆస్తులు, అప్పులు, సిబ్బంది సర్దుబాటు వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం గెజిట్‌తోపాటే లేదా వెనువెంటనే విడుదల చేసే అవకాశం కనిపిస్తున్నది. ఆర్డినెన్స్‌ ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్​ఎంసీ) చట్టం-, అలాగే తెలంగాణ మున్సిపాలిటీల చట్టం-2019లో కీలక సవరణలు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు వేర్వేరు పరిపాలనా విభాగాలుగా, స్వతంత్ర మున్సిపాలిటీలుగా కొనసాగుతున్న 27 ప్రాంతాలు ఇకపై జీహెచ్‌ఎంసీ చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ చట్ట సవరణల ద్వారా ఆయా మున్సిపాలిటీల పాలకవర్గాల అధికారాలు, విధులు, నిధుల వినియోగం వంటి అంశాల్లో సాంకేతిక చిక్కులు తలెత్తకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ న్యాయ నిపుణులతో సంప్రదించిన అనంతరం, మంత్రివర్గం పంపిన ముసాయిదాలోని అంశాలతో ఏకీభవిస్తూ సంతకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'హైదరాబాద్ మెగా సిటీ' ప్రణాళికలో ఈ విలీనం కీలకం కానుంది. ఓఆర్‌ఆర్‌ వరకు ఉన్న ప్రాంతాన్నంతటినీ ఒకే గొడుగు కిందికి తీసుకురావడం ద్వారా.. మౌలిక వసతుల కల్పనలో ఏకరూపత తేవచ్చని సర్కారు భావిస్తున్నది. ప్రస్తుతం శివారు మున్సిపాలిటీల్లో నిధుల కొరత, ప్రణాళికా లోపం కారణంగా డ్రైనేజీ, తాగునీరు, రోడ్ల వంటి సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటినీ జీహెచ్‌ఎంసీ పరిధిలోకి తెచ్చాక, మెరుగైన బడ్జెట్ కేటాయింపులతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల మంజూరు వంటి విషయాల్లో ఇకపై ఒకే విధానం అమలవుతుంది.

Post a Comment

0 Comments

Close Menu