Ad Code

చివరి టి20లో టీమిండియా గెలుపు : 3-1తో సిరీస్‌ టీమిండియా సొంతం


క్షిణాఫ్రికాతో జరిగిన చివరి టి20లో  టీమిండియా గెలిచి 3-1తో సిరీస్‌ సొంతం చేసుకొంది.  చాలా కాలం తర్వాత ఒకే పర్యటనలో భాగంగా మూడు ఫార్మాట్‌లలో జరిగిన సిరీస్‌లలో టీమిండియా పైచేయి సాధించింది. టెస్టు సిరీస్‌ ఫలితం బాధపెట్టేదే అయినా ఓవరాల్‌గా 5-4తో మన జట్టు పైచేయి సాధించింది. సిరీస్‌ ఓడిపోయే ప్రమాదం లేని స్థితిలో చివరి టి20లో బరిలోకి దిగిన భారత్‌ భారీ స్కోరుతో ప్రత్యరి్థకి చెక్‌ పెట్టింది. పాండ్యా అద్భుత బ్యాటింగ్, తిలక్‌ మెరుపులు ఇందులో కీలక పాత్ర పోషించాయి. డికాక్‌ జోరుతో సఫారీలు ఛేదన వైపు సాగినట్లు అనిపించినా అది కొన్ని ఓవర్లకే పరిమితమైంది. చేయాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోయి ఒత్తిడిలో జట్టు చిత్తయింది. టి20ల్లో భారత్‌కు ఇది వరుసగా 8వ సిరీస్‌ విజయం కావడం విశేషం. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' హార్దిక్‌ పాండ్యా (25 బంతుల్లో 63; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), తిలక్‌ వర్మ (42 బంతుల్లో 73; 10 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలు చేశారు. అనంతరం దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులకే పరిమితమైంది. క్వింటన్‌ డికాక్‌ (35 బంతుల్లో 65; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించగా, వరుణ్‌ చక్రవర్తికి 4 వికెట్లు దక్కాయి. భారత్‌కు సంజు సామ్సన్‌ (22 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అభిషేక్‌ శర్మ (21 బంతుల్లో 34; 6 ఫోర్లు, 1 సిక్స్‌) శుభారంభం అందించారు. అభిషేక్‌ తనదైన శైలిలో దూకుడుగా మొదలు పెట్టగా, గిల్‌ గైర్హాజరులో దక్కిన అవకాశాన్ని సామ్సన్‌ సమర్థంగా వాడుకున్నాడు. యాన్సెన్‌ ఓవర్లో తొలి మూడు బంతులను అభిషేక్‌ ఫోర్లుగా మలచగా, చివరి బంతికి సామ్సన్‌ సిక్స్‌ బాదడంతో మొత్తం 19 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత బార్ట్‌మన్‌ ఓవర్లో సామ్సన్‌ మూడు ఫోర్లు కొట్టాడు. అభిషేక్‌ వికెట్‌ కోల్పోయి పవర్‌ప్లే ముగిసే సరికి భారత్‌ 67 పరుగులు చేసింది. తొలి బంతికే ఫోర్‌తో మొదలు పెట్టిన తిలక్‌ కూడా తన ధాటిని ప్రదర్శించడంతో స్కోరు దూసుకుపోయింది. సామ్సన్‌ వెనుదిరిగాక మరో సారి సూర్యకుమార్‌ (5) వైఫల్యం కొనసాగింది. ఈ దశలో జత కలిసిన తిలక్, హార్దిక్‌ ద్వయం దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడింది. చూడచక్కటి ఫోర్లు కొట్టిన తిలక్‌ 30 బంతుల్లో అర్ధసెంచరీని అందుకున్నాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 44 బంతుల్లోనే 105 పరుగులు జోడించి స్కోరును 200 దాటించారు. చివర్లో దూబే (10 నాటౌట్‌) కూడా సిక్స్, ఫోర్‌తో తాను ఓ చేయి వేశాడు. భారీ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికాకు డికాక్‌ మెరుపు ఆరంభాన్ని ఇస్తూ అద్భుత షాట్లతో చెలరేగిపోయాడు. అర్ష్ దీప్‌ తొలి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అతను...అతని తర్వాతి ఓవర్లో మరో మూడు ఫోర్లు, సిక్స్‌ బాదడం విశేషం. పవర్‌ప్లే సఫారీ టీమ్‌ కూడా సరిగ్గా 67 పరుగులే సాధించింది. హెన్‌డ్రిక్స్‌ (13) వెనుదిరిగాక 30 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న డికాక్‌కు మరో ఎండ్‌లో బ్రెవిస్‌ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అండగా నిలిచాడు. పాండ్యా బౌలింగ్‌లో బ్రెవిస్‌ వరుసగా 4, 6, 4 కొట్టడం విశేషం. 10.1 ఓవర్లలో 120/1తో దక్షిణాఫ్రికా పటిష్టంగా కనిపించింది. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా కథ మారిపోయింది. డికాక్, బ్రెవిస్‌ రెండు పరుగుల వ్యవధిలో వెనుదిరిగాక ఇన్నింగ్స్‌ కుప్పకూలింది. మిగతా బ్యాటర్లలో ఎవరూ నిలవలేకపోయారు. తొలి బంతికే సూపర్‌ సిక్స్‌, మెరుపు వేగంతో దూసుకొచి్చన బంతి భుజానికి తగలడంతో కెమెరామన్‌ అల్లాడిపోయాడు. టీమ్‌ ఫిజియో వెళ్లి చికిత్స చేయాల్సి వచి్చంది. అలా మొదలైన హార్దిక్‌ పాండ్యా ఇన్నింగ్స్‌ అంతే విధ్వంసకరంగా సాగింది. తాను ఎదుర్కొన్న తర్వాతి రెండు బంతుల్లో సింగిల్, ఫోర్‌ కొట్టిన పాండ్యా... లిండే వేసిన 14వ ఓవర్లో వరుస బంతుల్లో 4, 6, 6, 4 బాదాడు. ఇంత పెద్ద మైదానంలో అతను కొట్టిన భారీ సిక్స్‌లు బౌండరీకి దగ్గర్లో కాకుండా ఎక్కడో గ్యాలరీల్లో పడ్డాయంటే ఆ వాడి ఎలాంటిదో అర్థమవుతుంది. తర్వాతి ఐదు బంతులు కాస్త జాగ్రత్తగా ఆడుతూ 7 పరుగులే రాబట్టినా...బాష్‌ ఓవర్లో మళ్లీ జోరు కనిపించింది. ఈ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన అతను అదే ఓవర్లో డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ సిక్స్‌ బాదడంతో 16 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తయింది. 

Post a Comment

0 Comments

Close Menu