దుబాయ్ వేదికగా జరిగిన అండర్-19 ఆసియాకప్ విజేతగా పాకిస్తాన్ నిలిచింది. ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ పై పాక్ 191 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సాధించింది. 348 పరుగలు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు పాక్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఏ దశలో భారత్ లక్ష్యం దిశగా సాగలేదు. వన్డే మ్యాచ్ అన్న విషయాన్ని మరిచి టీ20 మ్యాచ్ తరహాలో భారీ షాట్లకు యత్నించి బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో భారత్ 26.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ (26; 10 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు), ఆరోన్ జార్జ్ (16), అభిజ్ఞాన్ కుందు (13), ఖిలాన్ పటేల్ (19), దీపేష్ దేవేంద్రన్(36)లు మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. పాక్ బౌలర్లలో అలీ రజా నాలుగు వికెట్లు తీశాడు. మహ్మద్ సయ్యం, అబ్దుల్ సుభాన్, హుజైఫా అహ్సాన్ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. సమీర్ మిన్హాస్ (172; 113 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్స్‌లు) భారీ సెంచరీ చేశాడు. అహ్మద్ హుస్సేన్ (56; 72 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ మూడు, హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు కాన్షిక్ చౌహాన్ ఓ వికెట్ సాధించాడు.
0 Comments