ఇండోనేషియా రాజధాని జకార్తా శివార్లలోని ఒక ప్రైవేట్ వృద్ధాశ్రమంలో అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 16 మంది వృద్ధులు సజీవ దహనమయ్యారని అధికారులు ధృవీకరించారు. ప్రమాదం నుంచి మరో 15 మందిని అక్కడి సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తరలించారు. తూర్పు జకార్తాలోని 'కాసిహ్ సయాంగ్' వృద్ధాశ్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆశ్రమంలోని వృద్ధులంతా గాఢనిద్రలో ఉండటంతో ప్రాణనష్టం భారీగా జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. తూర్పు జకార్తా అగ్నిమాపక, రక్షణ విభాగం అధిపతి గటోట్ సులేమాన్ ఈ ఘటన గురించి మాట్లాడుతూ.. 'మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్నవారు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. చనిపోయిన 16 మందిలో 10 మంది మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. వీరంతా 65 నుండి 85 ఏళ్ల మధ్య వయస్సు గలవారని' ఆయన వివరించారు.
0 Comments