Ad Code

10 గంటల ముందే రైల్వే రిజర్వేషన్‌ చార్టు సిద్ధం : పరిమితి మించిన లగేజీలపై చార్జీలు


భారతీయ రైల్వే ముఖ్యమైన నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై రైలు బయల్దేరడానికి 10 గంటల ముందే రిజర్వేషన్‌ చార్టు సిద్ధం చేయాలని నిర్ణయించింది. ప్రయాణికులలో టెన్షన్ తగ్గించి, ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రైల్వేశాఖ రిజర్వేషన్‌ చార్టు రూపొందించే సమయాన్ని తాజాగా సవరించింది. ఇప్పటి వరకు రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు మాత్రమే రిజర్వేషన్‌ చార్టును రెడీ చేసేవారు. ఈ విధానం వల్ల వెయిటింగ్‌ లిస్ట్‌ లో ఉన్న ప్రయాణికులు తమకు సీటు దొరుకుతుందో? లేదో? అనే టెన్షన్ పడే వారు. ఒకవేళ బెర్త్ కన్ఫార్మ్ కాకపోతే అప్పటికప్పుడు ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బంది పడేవారు. పది గంటలు ముందుగా చార్టు సిద్ధం చేయడం వల్ల టికెట్ లభించకపోతే, ఈజీగా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకనే అవకాశం ఉంటుంది. అన్ని రైల్వే జోన్లు ఈ విధానాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని తాజాగా రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. రైళ్లలో తీసుకెళ్లే లగేజీ విషయంలోనే రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. గతంలో ఉన్న లగేజీ పరిమితుల విషయంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదని వెల్లడించింది. ఈ మేరకు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. రైల్లో ప్రయాణించే సమయంలో నిర్దేశిత బరువు దాటిన లగేజీకి చార్జీలు చెల్లించాల్సిందేనని లోక్‌ సభలో వెల్లడించారు. ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణించే వారికి 70 కిలోల వరకు లగేజీ తీసుకెళ్లేందుకు అనుమతి ఉన్నట్లు తెలిపారు. ఏసీ టూటైర్‌లో 50 కిలోల వరకు తీసుకెళ్లవచ్చు. ఏసీ త్రీటైర్‌ లో 40 కేజీల వరకు లగేజీ తీసుకు వెళ్లేందుకు అనుమతి ఉన్నట్లు తెలిపారు. జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికి కేవలం 35 కిలోల లగేజీ తీసుకు వెళ్లే అవకాశం ఉందని వివరించారు. పరిమితి దాటి లగేజీ తీసుకెళ్తే అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని వైష్ణవ్ వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu