Ad Code

నా ముఖం మీద గడ్డ, తలపై టోపీ నన్ను ఉగ్రవాదిగా చేస్తుందా? : తేజస్వీ యాదవ్‌పై ఓవైసీ ఆగ్రహం


బీహార్ లోని కిషన్ గంజ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ''ఓవైసీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదు అని ఒక ఇంటర్వ్యూలో తేజస్వీ యాదవ్‌ను అడిగారు. ఓవైసీ ఒక ఉగ్రవాది, ఒక మతోన్మాది అని తేజస్వీ అన్నారు. నేను నా మతాన్ని గర్వంగా అనుసరిస్తున్నాను కాబట్టి ఆయన నన్ను ఉగ్రవాది అని పిలుస్తారా'' అని అడిగారు. ''నీ ముందు వంగి నమస్కరించని వాడిని, అడుక్కోని వాడిని, నీ తండ్రి (లాలూ ప్రసాద్ యాదవ్)కు భయపడని వాడిని, నువ్వు పిరికి వాడు అంటావా? నా ముఖం మీద గడ్డ, తలపై టోపీ నన్ను ఉగ్రవాదిగా చేస్తుందా? నీలో ఎంత ద్వేషం ఉంది'' అని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజస్వీ యాదవ్ పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నాడు అని ఫైర్ అయ్యారు. తేజస్వీ యాదవ్ పూర్తిగా సీమాంచల్ ప్రాంతాన్ని అవమానించారని అన్నారు. ఎన్నికల ముందు ఓవైసీ, తేజస్వీతో పొత్తుపై చర్చలు జరిగాయి. ఎంఐఎంకు ఆరు సీట్లు ఇస్తామని ఆర్జేడీ ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి, దీనిని ఎవరూ అంగీకరించలేదు. దీంతో ఎంఐఎం బీహార్‌లోని 243 సీట్లలో ఎంఐఎం 100 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలని ప్రణాళిక వేసింది. తాము మూడో ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తామని ఎంఐఎం ఆశాభావం వ్యక్తం చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో ఐదు సీట్లు సాధించింది. ఆ తర్వాత ఇందులో నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీ పార్టీలో చేరగా, ఒకరు మరణించారు. 

Post a Comment

0 Comments

Close Menu