చండీగఢ్‌కు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియను సరళీకృతం చేయడాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉందని, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. ఈ ప్రతిపాదన చండీగఢ్ ప్రస్తుత పరిపాలనా వ్యవస్థను మార్చదని అలాగే పంజాబ్, హర్యానాలతో చండీగఢ్‌కు ఉన్న సాంప్రదాయ సంబంధాలను ప్రభావితం చేయదని హోం మంత్రిత్వ శాఖ ఈ ప్రకటనలో స్పష్టం చేసింది. చండీగఢ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, అందరితో సంప్రదించిన తర్వాతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొంది. రాబోయే శీతాకాల సమావేశాల్లో ఈ అంశంపై ప్రభుత్వం ఎటువంటి బిల్లును ప్రవేశపెట్టే ఉద్దేశం లేదని కూడా ఈ ప్రకటనలో హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించే ఆదేశాలు, చట్టాలను నేరుగా చేసే అధికారాలను రాష్ట్రపతికి కల్పించిన రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి చండీగఢ్‌ను కూడా తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పంజాబ్‌లోని పార్టీలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం పై విధంగా స్పందించింది. చండీగఢ్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించే ఆదేశాలు, చట్టాలను నేరుగా చేసే అధికారాలను రాష్ట్రపతికి కల్పించిన రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి తీసుకురావాలని చూడటాన్ని పంజాబ్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం ప్రతిపాదించిన ఈ బిల్లును ఆమ్ ఆద్మీ పార్టీ , కాంగ్రెస్, అకాలీదళ్ తీవ్రంగా వ్యతిరేకించాయి.
0 Comments