రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని ఒక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న అమైరా అనే 12 సంవత్సరాల విద్యార్థిని 5వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే విద్యార్థిని చనిపోయిన తర్వాత, పాఠశాల అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వకముందే సంఘటనా స్థలాన్ని మొత్తం శుభ్రం చేయడం అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థిని ఆత్మహత్య తర్వాత పాఠశాల ప్రిన్సిపాల్ తో సహా బాధ్యులైన వారంతా అదృశ్యమయ్యారు. పోలీసులు, విద్యా శాఖ అధికారులు ప్రిన్సిపాల్ తో సహా బాధ్యులను సంఘటనకు గల కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. విద్యార్థిని మరణం ప్రమాదమా, లేక ఆమె స్వయంగా దూకిందా లేదా ఎవరైనా తోశారా అని నేటి ఉదయం వరకు అనుమానాలుండేవి. కానీ ఆదివారం ఉదయం వైరల్ అయిన వీడియో గమనిస్తే విద్యార్థిని స్వయంగా బిల్డింగ్ లోని ఓ పై అంతస్తు నుంచి కిందకు దూకి సూసైడ్ చేసుకున్నట్లు స్పష్టమైంది. పన్నెండేళ్ల విద్యార్థిని మరణంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థినిని తీవ్రంగా మందలించాడని, దాంతో బాధపడి ఆమె ఐదవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుందని ప్రచారం జరుగుతోంది. విద్యార్థిని ఆత్మహత్యపై స్కూల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సంబంధిత వ్యక్తులు పరారీలో ఉన్నారు. అక్కడ అమర్చిన సిసిటివి ఫుటేజ్ మాత్రమే ఆధారం. సిసిటివి ఫుటేజ్ బయటకు రావడంతో ఆత్మహత్య అని తేలింది. ఈ సంఘటనపై రాజస్థాన్ విద్యా మంత్రి మదన్ దిలావర్ విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై జిల్లా విద్యాధికారికి విచారణ అప్పగించామని అన్నారు. విచారణ నివేదికలో ఎవరి నిర్లక్ష్యం తేలితే లేదా ఎవరైనా దోషిగా తేలితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు. స్కూల్ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
0 Comments