Ad Code

పెళ్లి చీర, డబ్బు విషయంలో వధూవరుల మధ్య వివాదం : వధువును ఇనుప రాడ్ తో కొట్టి హతమార్చిన వరుడు


గుజరాత్ లోని భావ్ నగర్ లో మరో గంటలో పెళ్లి జరుగుతుందనగా తాళి కట్టాల్సిన వరుడు పెళ్లి కుమార్తెను అత్యంత దారుణంగా హతమార్చాడు. ఒక చిన్న విషయంలో ఇద్దరి మధ్య చోటు చేసుకున్న వివాదం పెళ్లి కుమార్తె ప్రాణాలను బలి తీసుకోగా, పెళ్ళికొడుకు హంతకుడిగా మారాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం సాజన్ బరయ్య అనే వ్యక్తి, సోనీ రాథోడ్ అనే యువతి ఏడాదిన్నర కాలంగా సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. శనివారం రాత్రి వీరి వివాహం జరగాల్సి ఉండగా, పెళ్లికి కేవలం గంట ముందు పెళ్లి చీర విషయంలో, డబ్బుకు సంబంధించిన విషయంలో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన సాజన్, సోనీ పై ఇనుప రాడ్ తో దాడి చేశాడు. ఆపై ఆమె తలను బలంగా గోడకు కొట్టాడు. దీంతో సోనీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన నిందితుడు ఘటనా స్థలం నుండి పరారయ్యాడు. సోనీ మృతి చెందడం చూసిన పెళ్లికి వచ్చిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. సాజన్ ను పట్టుకోవడానికి బృందాలను రంగంలోకి దింపారు.

Post a Comment

0 Comments

Close Menu