ఉత్తరప్రదేశ్‌లో బీమా కంపెనీని మోసం చేయడానికి ప్రయత్నించి ఓ జంట అడ్డంగా బుక్కయ్యింది. భర్త చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికేట్ సృష్టించి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రూ.25 లక్షలు కొట్టేయాలని ప్రయత్నించారు. రవి శంకర్ అనే వ్యక్తి చనిపోయాడని నకిలీ పత్రాలు సృష్టించి భార్య కేశ్ కుమారి బీమా సొమ్ము రూ.25 లక్షలు క్లెయిమ్ చేయగా, అంతర్గత విచారణలో భర్త బతికే ఉన్నాడని తేలింది. ఈ మోసం వెలుగులోకి రావడంతో దంపతులను లక్నో పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ మోసం నకిలీ మరణ ధృవీకరణ పత్రం సృష్టించడం ద్వారా ప్రారంభమైంది. 2012 డిసెంబర్‌లో రవి శంకర్‌కు అవివా ఇండియా బీమా కంపెనీ నుంచి రూ.25 లక్షల విలువైన పాలసీ జారీ అయింది. రవి శంకర్ భార్య, కేశ్ కుమారి, ఏప్రిల్ 21, 2023 నాడు బీమా కంపెనీకి క్లెయిమ్ దరఖాస్తు చేసుకుంది. తన భర్త ఏప్రిల్ 9న మరణించినట్లు అందులో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని జతపరిచింది. నకిలీ పత్రాలను నమ్మిన బీమా కంపెనీ క్లెయిమ్‌ను ఆమోదించి, ఏప్రిల్ 21 నాడు రూ.25 లక్షల మొత్తాన్ని కేశ్ కుమారి ఖాతాకు బదిలీ చేసింది. క్లెయిమ్ డబ్బు బదిలీ అయినప్పటికీ, బీమా కంపెనీలు అనుమానాస్పద క్లెయిమ్‌లపై సాధారణంగా చేసే అంతర్గత దర్యాప్తు ఈ మోసాన్ని బయటపెట్టింది. బీమా క్లెయిమ్‌కు గురైన రవి శంకర్ బతికే ఉన్నాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీనితో ఇది స్పష్టంగా మోసమని తేలడంతో బీమా కంపెనీ ఫిర్యాదు దాఖలు చేసింది. అప్పటికే తమ మోసం బయటపడిందని గ్రహించిన రవి శంకర్, కేశ్ కుమారి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించడంతో తాము మోసానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారు.
0 Comments