మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ ట్రైనింగ్ అకాడమీల్లో భగవద్గీత అధ్యాయాల పఠనం తప్పనిసరి చేయాలని జారీ చేసిన ఆదేశాలు రాజకీయ వివాదానికి దారి తీసింది. రాష్ట్ర పోలీస్ ట్రైనింగ్ విభాగం తాజాగా జారీ చేసిన సర్క్యులర్‌లో, ప్రతి రోజు రాత్రి ధ్యానానికి ముందు శిక్షణార్థులు భగవద్గీతలోని ఒక అధ్యాయం చదవాలని సూచించింది. ఈ ఆదేశాలని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజా బాబు సింగ్ జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవద్గీత చదవడం వల్ల పోలీస్ ట్రైనింగ్ తీసుకునే వారు నీతి, ధర్మబద్ధతతో జీవించడం నేర్చుకుంటారని పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఈ సర్క్యులర్‌లని తీవ్రంగా తప్పబట్టింది. ఇది మతపరమైన ప్రేరేపణగా ఆరోపించింది. కాషాయీకరణగా ప్రయత్నమని, రాజ్యాంగానికి విరుద్ధమని తెలిపింది. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. మరోవైపు, అధికార పార్టీ అయిన బీజేపీ మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంది. భగవద్గీతలోని విలువలను పోలీస్ ట్రైనింగ్ లో పాటించడం వల్ల పోలీసుల్లో నైతికత పెరుగుతుందని వ్యాఖ్యానించారు. కాగా, గతంలో కూడా ఏడీజీపీ రాజా బాబు సింగ్ పోలీస్ శిక్షణ సంస్థల్లో తులసీదాస్ రామచరితమానస్ శ్లోకాలను పఠించమని ప్రోత్సహించారు. ఆయన గ్వాలియర్ రేంజ్ ఏడీజీపీగా ఉన్న సమయంలో జైళ్లలోని ఖైదీలకు భగవద్గీత గీతా పుస్తకాలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, రాజా బాబు ఇచ్చిన ఆదేశాలతో మతం, ప్రభుత్వ వ్యవస్థ, నైతికతల మధ్య సమతుల్యంపై మరోసారి చర్చ కొనసాగుతుంది.
0 Comments