బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ గురువారం జరిగింది. ఎన్డీయే కూటమికి చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) సమస్తిపూర్ ఎంపీ శాంభవి చౌదరి తన కుటుంబంతో కలిసి ఓటు వేశారు. ఆ తర్వాత జేడీ (యూ) నాయకుడైన తండ్రి అశోక్ చౌదరి, తల్లి నీతాతో కలిసి ఫొటోలకు ఆమె ఫోజులిచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ శాంభవి చౌదరి తొలుత తన కుడి చేతిని పైకి లేపారు. కుడి చూపుడు వేలిపై ఉన్న సిరా గుర్తును చూపించారు. కొంత గందరగోళానికి గురైన ఆమె వెంటనే ఎడమ చేతిని పైకి ఎత్తారు. ఆ చేతి వేలిపై కూడా సిరా గుర్తు ఉన్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఎంపీ శాంభవి చౌదరిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిందని, రెండు ఓట్లు వేసినట్లు కొందరు ఆరోపించారు. కెమెరా ముందు ఆమె తడబాటు దీనిని రుజువు చేస్తున్నదని కొందరు విమర్శించారు. అయితే ఎంపీ శాంభవి చౌదరి లేదా ఎన్నికల కమిషన్ ఈ వీడియో క్లిప్‌పై స్పందించలేదు.
0 Comments