Ad Code

అలంకరణ కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైన వధువు : ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోని తాళికట్టిన వరుడు


కేరళలోని ఆలప్పుజలోని కొమ్మడికి చెందిన అవని, తంబోలికి చెందిన వి.ఎం.షారన్‌ల వివాహం శుక్రవారం మధ్యాహ్నం తంబోలిలో జరగాల్సి ఉంది. అయితే, ఉదయాన్నే పెళ్లికూతురు అవని అలంకరణ కోసం కుమరకోమ్‌ వెళ్తుండగా, ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఒక చెట్టును బలంగా ఢీకొట్టింది. స్థానికులు వెంటనే గాయపడిన అవనిని కొట్టాయం వైద్య కళాశాలకు తరలించారు. ఆమె వెన్నెముకకు తీవ్ర గాయం కావడంతో, ప్రత్యేక చికిత్స కోసం మధ్యాహ్నం ఎర్నాకుళంలోని వీపీఎస్‌ లేక్‌షోర్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద వార్త విన్న షారన్, అతడి కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. అందరూ అయోమయంలో ఉన్నా, రెండు కుటుంబాల దృష్టి ముహూర్తంపైనే ఉంది. మధ్యాహ్నం 12.15 గంటల నుండి 12.30 గంటల మధ్య పెళ్లికి శుభ ముహూర్తం నిర్ణయించారు. దీంతో, ముహూర్త సమయం మించిపోకూడదన్న గట్టి సంకల్పంతో, రెండు కుటుంబాలు వివాహాన్ని ఆసుపత్రిలోనే జరిపించాలని కోరాయి. పరిస్థితిని అర్థం చేసుకున్న ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులను సంప్రదించి ఒక సాహసోపేత నిర్ణయం తీసుకుంది. వధువు అవనికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎమర్జెన్సీ విభాగంలోనే పెళ్లికి ఏర్పాట్లు చేసింది. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, అతికొద్దిమంది బంధువుల సాక్షిగా శుభ ముహూర్తంలో షారన్, అవని మెడలో తాళి కట్టి జీవిత సహచరిగా స్వీకరించాడు. ఆ క్షణంలో, ఆసుపత్రిలోని మెడికల్‌ పరికరాల శబ్దాల మధ్య.. బంధువుల దీవెనలు మారుమోగిపోయాయి. న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ సు«దీష్‌ కరుణాకరన్‌ మాట్లాడుతూ, అవని వెన్నెముకకు గాయమైనందున త్వరలోనే శస్త్రచికిత్స చేస్తామని తెలిపారు. ప్రాణం నిలవడానికి ఔషధం కావాలి, కానీ జీవితం మొదలవడానికి ముహూర్తం కావాలి.. అన్నట్లు. కత్తిరింపులు, కుట్లు, ఐవీ సెలైన్‌ల మధ్య ఈ వివాహ వేడుక జయప్రదంగా జరిగిపోయింది.

Post a Comment

0 Comments

Close Menu