ఢిల్లీలో జరిగిన జాతీయ గీతం 'వందేమాతరం' 150వ స్మారకోత్సవం కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ 'వందేమాతరం' కేవలం ఒక పాట మాత్రమే కాదని, అది దేశమాత పట్ల భక్తికి, ఆరాధనకు ప్రతీక అని ప్రధాని ఉద్ఘాటించారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో కోట్లాది మంది భారతీయులలో ఐక్యమత్యాన్ని, స్ఫూర్తిని నింపిన ఈ గీతం శక్తిని ఆయన కొనియాడారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని స్మారక స్టాంపు, నాణెం కూడా విడుదల చేయబడ్డాయి. ఈ గీతంలోని ప్రతి శబ్దం ప్రజల్లో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని, ప్రేరణను నింపుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భవిష్యత్తుపై అచంచలమైన భరోసాను కల్పిస్తుందని, లక్ష్య సాధనలో ముందుకు సాగే ధైర్యాన్ని ఇస్తుందని తెలిపారు. 'వందేమాతరం' అనేది ఒక పదం కాదు, అది ఒక మంత్రం, ఒక శక్తి, ఒక కల మరియు ఒక సంకల్పం అని ఆయన అభివర్ణించారు. ఈ మహత్తర సందర్భం నవ భారత పౌరులలో నూతన ప్రేరణను, శక్తిని నింపుతుందని ఆయన ఆకాంక్షించారు. అంతేకాకుండా, సామూహికంగా 'వందేమాతరం' గీతాలాపన చేయడం ఒక అద్భుతమైన, మాటల్లో చెప్పలేని అనుభవం అని ప్రధాని వివరించారు. ఇన్ని వేల గొంతులు ఉన్నప్పటికీ, ఒకే లయ, ఒకే స్వరం, ఒకే భావం వినిపించడం హృదయాన్ని స్పందింపజేస్తుందన్నారు. ఈ సామూహిక గీతాలాపనలో వ్యక్తమయ్యే ఏకత్వ ప్రవాహం, ఉప్పొంగే శక్తి మన దేశ ఐకమత్యాన్ని బలోపేతం చేస్తుందని ఆయన నొక్కి చెప్పారు. 'వందేమాతరం' స్వాతంత్ర్య సమరయోధుల వీడ్కోలు గీతం మాత్రమే కాదని, స్వేచ్ఛను ఎలా రక్షించుకోవాలో కూడా నేర్పే కాలాతీత స్ఫూర్తి అని ప్రధాని అన్నారు. ఈ గీతంలోని 'భారత్', 'మా భారతి' అనే మూల భావన ప్రతి దేశభక్తి గీతంలోనూ ప్రధానంగా ఉంటుందని తెలిపారు. 150 ఏళ్ల ఈ మహా ఉత్సవం ప్రతి భారతీయుడికి దేశం పట్ల తమ బాధ్యతలను గుర్తు చేస్తుందని, వికసిత్ భారత్ లక్ష్యం దిశగా కృషి చేయడానికి శక్తినిస్తుందని ప్రధాని అన్నారు.
0 Comments