పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లోని జ్యుడీషియల్ కాంప్లెక్స్ సమీపంలో జరిగిన శక్తిమంతమైన పేలుడులో కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో అత్యధికులు న్యాయవాదులేనని పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇది ఆత్మాహుతి దాడి అని భావిస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కోర్టు గేటు వద్ద పార్క్ చేసి ఉన్న ఓ కారులో ఈ పేలుడు సంభవించింది. ఇది అత్యంత రద్దీగా ఉండే సమయం కావడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, కారులోని గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని భావిస్తున్నా, ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల పార్క్ చేసిన అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. సుమారు ఆరు కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్దం వినిపించినట్లు స్థానికులు తెలిపారు.
0 Comments