Ad Code

ఛత్తీస్‌గఢ్‌లో గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు : 10 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు


త్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లా,లాల్‌ఖాదన్ సమీపంలో ఒక ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలును ఢీకొనడంతో 10 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బిలాస్‌పూర్‌ నుంచి కట్ని వైపు వెళ్తున్న ప్యాసింజర్‌ రైలు హౌరా మార్గంలో లాల్‌ఖాదన్ వద్ద నిలిపివున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఢీకొన్న దెబ్బకు ప్యాసింజర్ రైలు బోగీలు ఒక్కసారిగా తారుమారైనాయి. కొన్ని బోగీలు పట్టాలు తప్పడంతో భయానక దృశ్యం నెలకొంది. ప్రయాణికులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీయగా.. ఘటనా స్థలంలో ఆర్తనాదాలు మోగాయి. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు, స్థానిక పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని బిలాస్‌పూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. రైల్వే శాఖ తరఫున ప్రత్యేక రక్షణ బృందాలు హెలికాప్టర్ సహాయంతో రక్షణ చర్యల్లో నిమగ్నమయ్యాయి. ప్రమాదం జరిగిన హౌరా-ముంబై ప్రధాన రైలుమార్గంలో రైలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పలు రైళ్లను రద్దు చేస్తూ, కొన్ని రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించారు. ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ వైర్లు, సిగ్నల్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని రైల్వే అధికారులు తెలిపారు. మార్గం పునరుద్ధరణకు కనీసం 10-12 గంటలు పట్టవచ్చని అంచనా. ప్రమాదం అనంతరం రైల్వే శాఖ అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల చేసింది. గాయపడిన వారి వివరాల కోసం ప్రయాణికుల కుటుంబ సభ్యులు సంప్రదించవచ్చని తెలిపింది. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద రూ.10 లక్షలు, తీవ్ర గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయపడిన వారికి రూ.50,000 పరిహారం ప్రకటించారు. ప్రమాదంపై రైల్వే మంత్రి తక్షణమే సమీక్ష చేపట్టి, దర్యాప్తు ఆదేశించారు. ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరుగుతుందని తెలిపారు. "ప్రాణనష్టం చాలా బాధాకరం. బాధిత కుటుంబాలకు పూర్తి సహాయం అందిస్తాం," అని రైల్వే మంత్రి పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu