అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఆగ్రహానికి లోనయ్యారు. ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆమె తీవ్ర అసహనానికి గురై మాట తూలారు. వైట్ హౌస్ కాన్ఫిడెన్షియల్ ఉంచాల్సిన అంశం కావడం, దానిపైనే పదే పదే ప్రశ్నలు అడిగే సరికి ఆమె అదుపు తప్పారు. తన కోపాన్ని అదుపుచేసుకోలేకపోయారు. మీ అమ్మ పంపించింది.. అంటూ బదులిచ్చారు. అమెరికా, రష్యా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్-వ్లాదిమిర్ పుతిన్ శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన ప్రశ్న అది. ఈ సదస్సు ఎక్కడ జరగుతుందనే విషయాన్ని భద్రత కారణాల వల్ల ముందుగానే వెల్లడించడానికి వైట్ హౌస్ నిరాకరించింది. ఈ విషయాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రారంభం కావడానికి ముందే వివరించింది కూడా. అదే అంశాన్ని హఫింగ్టన్ పోస్ట్ రిపోర్టర్ ప్రశ్నించడంతో కరోలినా లీవిట్ ఆయనతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ సమావేశం బుడాపెస్ట్‌లో జరిగే అవకాశం ఉంది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే విషయంపై చర్చించడానికి డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ త్వరలో ఓ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇదే అంశం ట్రంప్- ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీతో వైట్ హౌస్ లో ఏర్పాటైన సమావేశంలోనూ ప్రస్తావనకు వచ్చింది. యుద్ధానికి పుల్ స్టాప్ పెట్టే విషయంలో పుతిన్ షరతులను తాను పర్యవేక్షిస్తానని, వీటిని అంగీకరించాల్సి ఉంటుందని జెలెన్ స్కీకి సూచించారు. త్వరలోనే ట్రంప్- పుతిన్ భేటీ జరుగనుంది. దీనికి సంబంధించిన వివరాలను హఫింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ పదే పదే టెక్స్ట్ మెసేజ్ చేయడంతో కరోలినా తన కోపాన్ని దాచుకోలేకపోయారు. సమావేశ స్థలాన్ని ఎవరు ఎంపిక చేశారని ప్రశ్నిస్తూ లీవిట్‌కు మెసేజ్ చేశారు. దీంతో ఆమె ఆగ్రహానికి గురయ్యారు. "మీ అమ్మ పంపించింది.." అని సమాధానం ఇచ్చారు. తర్వాత ఆమె ఈ సంభాషణ స్క్రీన్‌షాట్‌ను తన ఎక్స్ అకౌంట్ లో షేర్ చేశారు. అతను వాస్తవాలను కోరుకునే జర్నలిస్టు కాదని విమర్శించారు. లెఫ్ట్-వింగ్ హాక్ అని అభివర్ణించారు. సంవత్సరాల తరబడి డొనాల్డ్ ట్రంప్‌పై నిరంతరం దాడి చేస్తూనే ఉన్నాడని, తన ఫోన్‌ను డెమోక్రాట్ వ్యాఖ్యలతో నింపుతున్నాడని మండిపడ్డారు. ఈ డేట్ ఫీడ్‌ను గమనించాలని, అది ట్రంప్‌కు వ్యతిరేకంగా రాసిన వ్యక్తిగత డైరీలా ఉందని ఆరోపించారు. రిపోర్టర్లుగా నటిస్తున్న కొందరు డెమోక్రటిక్ కార్యకర్తలు, యాక్టివిస్టులు జర్నలిజానికి చెడ్డపేరు తెస్తున్నారని విమర్శించారు.
0 Comments