రాజస్తాన్‌లోని భిల్వారాలోని ఒక పెట్రోల్ బంక్ దగ్గర జరిగిన ఘర్షణలో సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ ఛోటు లాల్ శర్మ పెట్రోల్ బంక్ కార్మికుడిని చెంపదెబ్బ కొట్టారు. అనంతరం కార్మికులు కూడా ఎదురు తిరిగి ప్రతి దాడికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఛోటు లాల్ శర్మ భార్య దీపికా వ్యాస్‌తో కలిసి కారులో పెట్రోల్ కొట్టించుకునేందుకు బంక్‌కు వచ్చారు. ఈ క్రమంలో బంక్ కార్మికుల్లో ఒకరు దీపికా వ్యాస్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. దీపికా వ్యాస్‌ను చూసి కన్నుగీటాడు. ఈ విషయాన్ని ఆమె భర్తకు తెలియజేసింది. దీంతో కోపోద్రేకుడైన ఛోటు లాల్ శర్మ కార్మికుడి చెంపచెల్లుమనిపించారు. ఈ క్రమంలో శర్మ కారుకి పెట్రోల్ కొట్టకుండా వెనుక ఉన్న కారుకు పెట్రోల్ కొట్టడంతో ఆయనకు మరింత కోపం వచ్చి వాగ్వాదానికి దిగాడు. ఈ ఘర్షణలో కార్మికులు కూడా శర్మపై దాడికి దిగారు. వెంటనే శర్మ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటినా సంఘటనాస్థలికి చేరుకుని ముగ్గురు కార్మికులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను పరిశీలిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. ఆధారాలు సేకరణ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే ఛోటు లాల్ శర్మకు గతంలో కూడా అనేక వివాదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. శర్మ కెరీర్‌లో అనేక వివాదాలు ఉన్నాయని స్థానిక వర్గాలు పేర్కొన్నాయి. ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీడియోల పరిశీలన, సాక్షుల వాంగ్మూలాలు ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు అధికారులు తెలిపారు.
0 Comments