ఆర్జేడీ పార్టీతో పాటు కుటుంబం నుంచి బహిష్కరణకు గురైన తేజ్ ప్రతాప్ యాదవ్.. ఆ పార్టీలో తిరిగి చేరడం కంటే చనిపోవడం మేలంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన 'జనశక్తి జనతా దళ్' అనే పేరుతో సొంత పార్టీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. తేజ్ ప్రతాప్ యాదవ్ 2015లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన మహువా నియోజకవర్గం నుంచే ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ తన రాజకీయ భవిష్యత్తు, కుటుంబ సంబంధాలపై మాట్లాడారు. 'మీరు తిరిగి ఆర్జేడీలో చేరుతారా?' అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఆ పార్టీలో తిరిగి చేరే బదులు చావడం మంచిదని చెప్పారు. తనకు అధికారంపై ఎలాంటి ఆశ లేదన్నారు. ప్రజలకు సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. నైతిక విలువలు, స్వీయ గౌరవమే తన దృష్టిలో అత్యున్నతమైనవి అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. తాను నిజాయితీగా పని చేస్తున్నానని.. అందుకే ప్రజలు తనను ప్రేమిస్తారని, విశ్వసిస్తారని చెప్పారు. 'ఇండియా' బ్లాక్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన సోదరుడు తేజస్వి యాదవ్‌ను ప్రకటించడంపై కూడా తేజ్ ప్రతాప్ స్పందించారు. అధికార పీఠం దక్కించుకోవడానికి కేవలం ప్రకటనలు సరిపోవని, ప్రజల సంపూర్ణ ఆశీర్వాదం తప్పనిసరి అని చెప్పారు. రాజకీయ నాయకులు రకరకాల ప్రకటనలు చేస్తుంటారని, కానీ ప్రజల ఆశీర్వాదం ఎవరికి ఉంటే వారే అధికారాన్ని పొందుతారని అన్నారు. తమ తండ్రి పేరు చెప్పుకుని మాత్రమే తేజస్వీ ఈ స్థాయికి వచ్చాడని అన్నారు. ఈ ఎన్నికల్లో తాను ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోనని, ఒకవేళ ఆర్జేడీ నుంచే ఏదైనా పదవి ఆఫర్ చేసినా తాను తిరస్కరిస్తానని చెప్పారు. అలాగే మహువా నియోజకవర్గంతో తనకు రాజకీయాల్లోకి రాకముందే అనుబంధం ఉందని, అక్కడి ప్రజలు తననే తమ ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారని తేజ్ ప్రతాప్ తెలిపారు. ఈ ఎన్నికల్లో గెలవబోయేది తానేనన్న తేజ్ ప్రతాప్ యాదవ్ ఎమ్మెల్యే అయ్యాక మహువాలో క్రికెట్ స్టేడియం కట్టిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా తాను కట్టించబోయే మహువా క్రికెట్ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కూడా జరుగుతుందని తాను హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
0 Comments