మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీలో శ్రీలంక థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. సోమవారం బంగ్లాదేశ్‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో శ్రీలంక 7 పరుగుల తేడాతో చిరస్మరణీయమైన విజయాన్నందుకుంది. ఈ విజయంతో సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగా బంగ్లాదేశ్ రేసు నుంచి తప్పుకుంది. కెప్టెన్ ఆటపట్టు సంచలన బౌలింగ్‌తో ఓడిపోయే మ్యాచ్‌లో శ్రీలంక గెలిచింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 48.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. హసిని పెరెరా(99 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 85) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ చమరి ఆటపట్టు(43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46) కీలక ఇన్నింగ్స్ ఆడింది. బంగ్లాదేశ్ బౌలర్లలో షోర్నా అక్తెర్(3/27) మూడు వికెట్లు తీయగా.. రబెయా ఖాన్(2/39), నహిదా అక్తెర్, నిషితా అక్తెర్, మరుఫా అక్తెర్ తలో వికెట్ తీసారు. అనంతరం బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 195 పరుగులే చేసి ఓటమిపాలైంది. షర్మిన్ అక్తర్ (103 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 64 నాటౌట్), నిగర్ సుల్తానా (98 బంతుల్లో 6 ఫోర్లతో 77) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. శ్రీలంక బౌలర్లలో చమరి ఆటపట్టు (4/42) నాలుగు వికెట్లతో రాణించగా, సుగందిక కుమారి (2/38) రెండు వికెట్లు పడగొట్టింది. ప్రబోధిణికి ఒక వికెట్ దక్కింది. బంగ్లాదేశ్ విజయానికి ఆఖరి 6 బంతుల్లో 9 పరుగులు అవసరం కాగా క్రీజులో సెట్ అయిన నిగర్ సుల్తానా ఉంది. దాంతో బంగ్లా విజయం లాంఛనమేనని అంతా అనుకున్నారు. కానీ శ్రీలంక కెప్టెన్ ఆటపట్టు సంచలన బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పింది. వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసి బంగ్లాదేశ్ పతనాన్ని శాసించింది. రబేయా ఖాన్ (1), నహిదా అక్తెర్ (0), నిగర్ సుల్తాన (77), మురుఫా అక్తెర్ (0) వరుసగా ఔటయ్యారు. ఇందులో నహిదా అక్తెర్ రనౌట్ కాగా, రబేయా ఖాన్, మరుఫా అక్తెర్ ఎల్బీగా వెనుదిరిగారు. నిగర్ సుల్తాన క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరింది. ఈ టోర్నీలో శ్రీలంకకు ఇదే తొలి విజయం. ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక ఒక గెలుపు, ఓ మ్యాచ్ రద్దుతో పాటు ఫలితం తేలని మరో మ్యాచ్‌తో 4 పాయింట్స్ సాధించి 6వ స్థానంలో కొనసాగుతోంది. పాకిస్థాన్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించి.. భారత్, న్యూజిలాండ్ తమ తదుపరి రెండు మ్యాచ్‌ల్లో ఓడితే శ్రీలంక సెమీస్ చేరుతోంది. 6 మ్యాచ్‌ల్లో 5 పరాజయాలతో బంగ్లాదేశ్ అధికారికంగా సెమీస్ రేసు నుంచి తప్పుకుంది.
0 Comments