Ad Code

ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన సముదాయ నిర్మాణంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష


స్మానియా ఆసుపత్రి కొత్త భవన సముదాయ నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దీన్ని రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరాలకు తగినట్లు అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుకోవాలని, ఇందుకు సంబంధించి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. అధునాతన పరికరాల ఏర్పాటుకు తగినట్లు గదులు, ల్యాబ్‌లు, ఇతర నిర్మాణాలు ఉండాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఆసుపత్రి నిర్మాణ పనులతో పాటు స్థానికులకు ఇబ్బంది లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఆసుపత్రి నిర్మాణ పనుల వేగవంతానికి వైద్య ఆరోగ్యం, ఆర్ అండ్ బీ, విద్యుత్, పోలీస్ మంత్రిత్వ శాఖతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో వెంటనే ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రతి 10 రోజులకోకసారి సమావేశమై ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకుంటూ పనులు వేగంగా జరిగేలా చూడాల్సి ఉంటుందని అన్నారు. ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యాక అక్కడి బందోబస్తు, ట్రాఫిక్ విధుల నిర్వహణకు సంబంధించి ముందుస్తుగానే తగిన ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. ఆసుపత్రికి వివిధ రహదారులను అనుసంధానించే ప్రణాళికలు ఇప్పటి నుంచే రూపొందించాలని ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల నిర్మాణానికి సంబంధించి ప్రతి నిర్మాణానికి ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించాలని సూచించారు. నిర్మాణాలపై 24 గంటల పాటు పర్యవేక్షించేలా ఆ అధికారికి పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించాలని చెప్పారు. వచ్చే జూన్ నాటికి నిర్మాణాల్నీ కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వీ శేషాద్రి, శ్రీనివాస్ రాజు, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, పోలీస్ డైరెక్టర్ జనరల్ బీ శివధర్ రెడ్డి, సీనియర్ అధికారులు వికాస్ రాజ్, క్రిస్టియానా చొంగ్తు, ఇలంబర్తీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన, తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఇందులో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu