వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఓ వన్డే మ్యాచ్‌లో తొలి ఐదుగురితో స్పిన్ బౌలింగ్ వేయించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకు ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. తొలి నలుగురితో స్పిన్ బౌలింగ్ చేయించిన దాఖలాలు (ఐదు సందర్భాల్లో) ఉన్నా, అవి అసోసియేట్ దేశాల క్రికెట్‌లో జరిగాయి. ఓ ఫుల్ మెంబర్ జట్టు తొలి ఐదుగురి బౌలర్లతో స్పిన్ వేయించడం మాత్రం వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి. ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. విండీస్ కెప్టెన్ రోస్టన్ ఛేజ్ తొలుత బౌలింగ్ చేస్తూ ఐదుగురు స్పిన్నర్లను ప్రయోగించాడు. రెండు ఎండ్ల నుంచి స్పిన్నర్లతోనే దాడి ప్రారంభించాడు. ఇలా జరగడం కూడా వన్డే క్రికెట్ చరిత్రలో ఐదోసారి మాత్రమే. గత మూడు ఘటనలు ఇదే వేదికగా జరిగాయి. మూడు సందర్భాల్లో కూడా బంగ్లాదేశే ఈ ప్రయోగాన్ని చేసింది. న్యూజిలాండ్ జట్టు వన్డే క్రికెట్‌లో తొలిసారి ఈ ప్రయోగాన్ని చేసిన జట్టుగా నిలిచింది. 2017లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు రెండు ఎండ్ల నుంచి స్పిన్నర్లతో బౌలింగ్ ప్రారంభించింది. కాగా 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌ల కోసం విండీస్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది.
0 Comments