అమెరికాలో హాలీవుడ్ సినిమా తరహాలో అమెరికాలోని డెన్వర్ నుంచి లాస్ ఏంజెల్స్ కు ప్రయాణిస్తున్న ఓ విమానానికి అనూహ్య ఘటన ఎదురైంది. 36 వేల అడుగుల ఎత్తులో ప్రశాంతంగా ప్రయాణిస్తున్న బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానానికి ఎదురుగా ఓ అదృశ్య వస్తువు ఎగురుతూ వచ్చింది. పైలట్లు దాన్ని గమనించే లోపే అది విండ్ షీల్డ్ పగులగొట్టుకుని కాక్ పిట్ లోకి దూసుకుని వచ్చేసింది. దీంతో ఈ విమానం నడుపుతున్న ఇద్దరు పైలట్లలో ఒకరు గాయపడ్డారు. ఇదంతా జరుగతున్న సమయంలో సదరు బోయింగ్ విమానంలో 134 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ అదృశ్యవస్తువ దాడి కారణంగా పైలట్ చేతులకు గాయాలు అయి రక్తం కారుతున్న ఫొటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. డ్యాష్‌బోర్డ్, కాక్‌పిట్‌పై పగిలిన గాజు ముక్కలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ వస్తువు ఢీకొన్న ప్రదేశంలో కాలిన గుర్తులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ సంఘటనకు గల కారణాల గురించి యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వివరాలు బయటపెట్టలేదు. ఈ అనూహ్య ఘటనకు కారణమేమిటో ఇంకా తేలలేదు. అంతరిక్ష శిథిలాలు వాణిజ్య విమాన ప్రయాణీకుడికి గాయాలు కలిగించే అవకాశం చాలా అరుదు అని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. పక్షులు, వడగళ్ళు, ఇతర వస్తువులు తక్కువ ఎత్తులో విమానాలను ఢీకొనే అవకాశం ఉంది. కానీ ఈ ఘటన చూస్తే వాటికి భిన్నంగా ఉంది. ఎందుకంటే ఈ బోయింగ్ విమానం 36 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. దీంతో ఆ అదృశ్య వస్తువు గురించి అధ్యయనం చేస్తున్నారు.
0 Comments