కేరళ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పెను ముప్పుతప్పింది. హెలికాఫ్టర్ ల్యాండింగ్ సమయంలో బురదలో కూరుకునిపోయింది. దీంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే, భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తేవడంత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేరళలో నాలుగు రోజుల పర్యటన కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె బుధవారం శబరిమల అయ్యప్పస్వామిని దర్శనం చేసుకోవాల్సివుంది. ఇందుకోసం కొచ్చిన్‌లోని ప్రమదం స్టేడియానికి హెలికాఫ్టర్‌లో చేరుకున్నారు. అయితే, హెలికాఫ్టర్ ల్యాండ్ అయిన సమయంలో దాని టైర్లు ఒకవైపు బురదలో పూర్తిగా దిగబడిపోయాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సాయంతో హెలికాఫ్టర్‌ను అతి కష్టంమీద బురద నుంచి బయటకు నెట్టి సురక్షిత ప్రదేశానికి చేర్చారు. ఈ అనూహ్య ఘటనతో షెడ్యూల్ కొద్దిసేపు నిలిచిపోయింది. ఆ తర్వాత రాష్ట్రపతి అక్కడి నుంచి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. ఈ ఘటనతో అధికారులు భద్రతా ఏర్పాట్లపై పునఃసమీక్ష చేపట్టారు.
0 Comments