అమెరికాలోని న్యూయార్క్ సరటోగా కౌంటీలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన మేహుల్ గోస్వామి భారీ మోసానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై అరెస్టయ్యాడు. ఒకే సమయంలో రెండు పూర్తిస్థాయి ఉద్యోగాలు చేస్తూ (మూన్ లైటింగ్) ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశాడన్న అభియోగాలపై పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేరం రుజువైతే అతనికి 15 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 39 ఏళ్ల మేహుల్ గోస్వామిని స్థానిక షెరీఫ్ కార్యాలయం అరెస్ట్ చేసింది. అతను న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ లో రిమోట్ ఉద్యోగిగా పనిచేస్తూనే, మాల్టాలోని మరో సంస్థలో కూడా పూర్తిస్థాయి ఉద్యోగం చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ విధంగా అతను ప్రభుత్వానికి 50,000 డాలర్లకు (సుమారు రూ. 44 లక్షలు) పైగా నష్టం కలిగించాడని అధికారులు ఆరోపిస్తున్నారు. అతనిపై సెకండ్-డిగ్రీ గ్రాండ్ లార్సెనీ కింద కేసు నమోదు చేశారు.
0 Comments