Ad Code

నీరజ్ చోప్రాకు గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా


ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, భారత జావెలిన్ ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా భుజంపై గౌరవ చిహ్నాలను అలంకరించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ నీరజ్ చోప్రా పట్టుదల, దేశభక్తి, నిబద్ధతకు నిలువుటద్దం వంటి వారని కొనియాడారు. క్రీడారంగంలో ఆయన సాధించిన అద్భుత విజయాలు దేశానికి గర్వకారణమని, ఆయన క్రీడాకారులకు, సైనిక దళాలకు ఒకేలా స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఇతర ఉన్నతాధికారులు, నీరజ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నీరజ్ చోప్రా 2016 ఆగస్టు 26న రాజ్‌పుతానా రైఫిల్స్‌లో నాయబ్ సుబేదార్‌గా భారత సైన్యంలో చేరారు. అప్పటి నుంచి క్రీడల్లో రాణిస్తూనే దేశానికి సేవ చేస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన ఆయన, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజతం గెలుచుకున్నారు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లోనూ ఆయన స్వర్ణ పతకాలు సాధించారు. దేశానికి ఆయన అందించిన సేవలు, క్రీడల్లో సాధించిన విజయాలకు గుర్తింపుగా నీరజ్ చోప్రాకు ఈ గౌరవ హోదాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఏడాది ఏప్రిల్ 16నే ఆమోదించారు. దీనికి సంబంధించిన అధికారిక కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. నీరజ్ చోప్రా ఇప్పటికే పద్మశ్రీ, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, అర్జున అవార్డులతో పాటు పరమ విశిష్ట సేవా పతకం, విశిష్ట సేవా పతకం వంటి సైనిక పురస్కారాలను కూడా అందుకున్నారు.

Post a Comment

0 Comments

Close Menu