Ad Code

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వివాదాన్ని త్వరలోనే పరిష్కరిస్తాను : డొనాల్డ్ ట్రంప్


పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య నెలకొన్న వివాదాన్ని తాను త్వరలోనే పరిష్కరిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌లను "గొప్ప వ్యక్తులు"గా ఆయన అభివర్ణించారు. థాయ్‌లాండ్, కంబోడియా మధ్య దీర్ఘకాలంగా ఉన్న వివాదానికి ముగింపు పలుకుతూ కుదిరిన శాంతి ఒప్పందంలో మధ్యవర్తిత్వం వహించిన ట్రంప్, అనంతరం మలేషియాలోని కౌలాలంపూర్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ఇది చాలా సుదీర్ఘమైన శాంతి కాబోతోంది. మా ప్రభుత్వం కేవలం 8 నెలల్లో 8 యుద్ధాలను ఆపింది. అంటే నెలకు సగటున ఒకటి అన్నమాట" అని పేర్కొన్నారు. "ఇప్పుడు ఒక్కటే మిగిలి ఉంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య గొడవ మొదలైందని విన్నాను. దాన్ని కూడా చాలా వేగంగా పరిష్కరిస్తాను. వాళ్లిద్దరూ నాకు తెలుసు. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్, ప్రధాని ఇద్దరూ గొప్ప వ్యక్తులు. ఆ సమస్యను మేం త్వరగా పరిష్కరిస్తామనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు."నేను ఈ పనిని ఎంతో చక్కగా చేస్తాను. నేను చేయాల్సిన అవసరం లేదేమో, కానీ కొన్ని లక్షల ప్రాణాలను కాపాడగలిగితే అంతకంటే మంచి పని ఏముంటుంది? ఏ అధ్యక్షుడు ఒక్క యుద్ధాన్ని కూడా పరిష్కరించినట్లు నేను అనుకోను. వాళ్లు యుద్ధాలను ప్రారంభిస్తారు" అని ట్రంప్ అన్నారు.అయితే, ట్రంప్ ఇలా యుద్ధాలను ఆపినట్లు చెప్పుకోవడం ఇది మొదటిసారి కాదు. ఇటీవలే నోబెల్ శాంతి బహుమతికి దూరమైన ట్రంప్, తన రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక యుద్ధాలను తానే ఆపినట్లు పదేపదే చెబుతున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu