తెలంగాణాలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకువస్తోంది. ఇకపై వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్‌ను జతచేయడం తప్పనిసరి చేస్తూ ఈ సర్వే ప్రక్రియకు సంబంధించి లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించి, వారికి చెల్లించాల్సిన ఫీజులను కూడా ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. లైసెన్స్‌డ్ సర్వేయర్ల ద్వారా జరిపే భూముల సర్వేకు సంబంధించి ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసింది. రెండెకరాల్లోపు విస్తీర్ణానికి సర్వే చేసి, పటం (మ్యాప్) అందించడానికి రైతులకు రూ.వెయ్యి ఫీజు వసూలు చేయనున్నారు. ఈ ఫీజులో ప్రభుత్వం 5 శాతం మినహాయించుకుని మిగిలిన 95 శాతం మొత్తాన్ని సర్వేయర్లకు చెల్లించనుంది. ప్రస్తుతం మండల సర్వేయర్ ద్వారా ఒక రైతుకు చెందిన నాలుగు సర్వే నంబర్లలోపు భూ విస్తీర్ణాన్ని సర్వే చేయడానికి ఆన్‌లైన్ ద్వారా రూ.275 ఫీజు వసూలు చేస్తున్నారు. కానీ ఈ పద్ధతిలో సబ్ డివిజన్ సర్వే మాత్రం క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో జరగడం లేదు. ఈ లోపాన్ని సరిచేయడానికి, పారదర్శకత కోసం ప్రభుత్వం లైసెన్స్‌డ్ సర్వేయర్ల విధానాన్ని అమలులోకి తీసుకువస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు మండలాల్లో భూ విస్తీర్ణాన్ని బట్టి నాలుగు నుంచి ఆరుగురు లైసెన్స్‌డ్ సర్వేయర్లను ప్రభుత్వం కేటాయించనుంది. వీరికి ఇప్పటికే లైసెన్స్ పత్రాలను అందజేసింది. త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ తేదీని ప్రభుత్వం ప్రకటించనుంది. ఈ తేదీ నుంచి 'భూభారతి చట్టం' ప్రకారం సాగు భూముల రిజిస్ట్రేషన్లు-మ్యుటేషన్ల సందర్భంగా సర్వే పటం జోడించడం తప్పనిసరి అవుతుంది. భూ సర్వే కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక యాప్ లేదా వెబ్‌సైట్‌ను రూపొందిస్తోంది. భూ యజమాని ఈ యాప్/వెబ్‌సైట్‌లో చలానా చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసిన వెంటనే వివరాలు లైసెన్స్‌డ్ సర్వేయర్‌కు చేరుతాయి. సర్వేకు వసూలు చేసిన మొత్తాన్ని ప్రభుత్వం మూడు దఫాలుగా లైసెన్స్‌డ్ సర్వేయర్ల బ్యాంకు ఖాతాలకు పంపిస్తుంది. క్షేత్రస్థాయిలో భూమిని పరిశీలించి, వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసిన వెంటనే మొదటి విడతగా 30% ఫీజు జమవుతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే మరో 30% ఫీజు జమ అవుతుంది. అధికారులు పరిశీలన పూర్తికాగానే చివరి విడతగా మిగిలిన 35% మొత్తాన్ని సర్వేయర్ల ఖాతాలో జమ చేయనున్నారు. ఈ కొత్త విధానం వల్ల భూముల రిజిస్ట్రేషన్లు మరింత పారదర్శకంగా, త్వరితగతిన పూర్తి అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. రెండెకరాల వరకు రూ. వెయ్యి, 2-5 ఎకరాల వరకు రూ. 2 వేలు, 5-10 ఎకరాల వరకు రూ. 5 వేలు, విస్తీర్ణం 10 ఎకరాలు మించితే రూ. 5 వేలకు అదనంగా ప్రతి ఎకరాకు రూ. 500 చొప్పున ఫీజు వసూలు చేయనున్నారు.
0 Comments