అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ నగరం ఈ నెల 19వ తేదీని "శ్రీశ్రీ రవిశంకర్ దినోత్సవం"గా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మానసిక ఒత్తిడి, హింస లేని సమాజాన్ని నిర్మించేందుకు, ప్రజల మానసిక ఆరోగ్యాన్ని, వివిధ మతాల మధ్య సుహృద్భావాన్ని పెంపొందించటం, సమాజాభివృద్ధికి కృషి చేయటం వంటి విషయాలలో రవిశంకర్ చేసిన సేవకుగానూ ఈ గౌరవాన్ని ప్రకటిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గౌరవింపబడుతున్న మానవతావాది, ఆధ్యాత్మికవేత్త, శాంతిదూత అయిన శ్రీశ్రీ రవిశంకర్ ఒత్తిడి లేని, హింస లేని సమాజం నెలకొల్పాలనే లక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలలో 8కోట్లకు పైగా ప్రజలను ప్రభావితం చేసిందని సియాటెల్ నగర మేయర్ బ్రూస్ హారెల్, వాంకోవర్ మేయర్ కెన్ సిమ్ పేర్కొన్నారు. రవిశంకర్ స్థాపించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నిర్వహించిన ఒత్తిడి నిర్మూలన శిబిరాలు, యువ నాయకత్వ శిబిరాలు, సామాజిక అభివృద్ధి, సేవా కార్యక్రమాలు అక్కడి ప్రజలలో మానసిక దృఢత్వం, సౌభ్రాతృత్వాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు తోడ్పడటమేగాక శాంతియుత వాతావరణం, మహిళా సాధికారికతను పెంపొందించాయన్నారు. చివరగా ఇక అంతకు ముందురోజైన అక్టోబర్ 18వ తేదీన వాంకోవర్ నగరం సైతం గురుదేవుల్ని ఇదే విధంగా సత్కరించి, అక్టోబర్ 18వ తేదీని గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ దినం గా ప్రకటించటం గమనార్హం.
0 Comments