తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్య శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్ విద్యలో పలు సంస్కరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ మార్పులు అమలులోకి రానున్నాయి. తెలంగాణ ఇంటర్ విద్యలో పలు మార్పులు చేయాలని కొంతకాలం క్రితం ఇంటర్మీడియట్ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఆమోదం తెలిపారు. ఈ మార్పులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలులోకి రానున్నాయి. ఎంపీసీ, బైపీసీ ఫస్టియర్‌లో సైతం ప్రాక్టికల్ పరీక్షలు ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో సెకండియర్‌లో మాత్రమే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న మార్కులను సగం సగం కేటాయిస్తారు. అంటే, ఫస్టియర్‌లో సగం, సెకండియర్‌లో సగం మార్కులు ఉండనున్నాయి. ఉదాహరణకు ఎంపీసీ గ్రూప్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సెకండియర్‌లో పరీక్షలు నిర్వహిస్తుండగా ఒక్కో సబ్జెక్ట్‌కు 30 మార్కుల చొప్పున కేటాయిస్తున్నారు. ఇప్పుడు కొత్త విధానంలో ఒక్కో సబ్జెక్ట్‌కు కేటాయించే 30 మార్కులలో... ఫస్టియర్‌లో 15, సెకండియర్‌లో 15 మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఇంటర్‌లో అన్ని సబ్జెక్టులకు కొత్త 80:20 మూల్యాంకన విధానం వుంది. ఈ ప్రకారం రాత పరీక్షకు 80 శాతం మార్కులు, ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లకు 20 శాతం మార్కులు ఉంటాయి. ప్రస్తుతం ఇంగ్లీష్ సబ్జెక్టుకు మాత్రమే ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులు ఉన్నాయి. కొత్తగా తీసుకొచ్చన మార్పులతో సంస్కృతం, తెలుగు, గణితం తదితర అన్ని సబ్జెక్టులకు ఇంటర్నల్ మార్కులు ఉండనున్నాయి. ప్రాక్టికల్స్ ఉన్న సబ్జెక్టులకు కూడా ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులుంటాయి. కొత్తగా అకౌంట్స్, ఎకనామిక్స్, కామర్స్ గ్రూప్‌ను తీసుకురానున్నారు. ఎంపీసీ గ్రూప్ సబ్జెక్టులకు సిలబస్ తగ్గించనున్నారు. ఎన్‌సీఈఆర్‌టీ ప్రమాణాలకు అనుగుణంగా గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం సిలబస్‌లో మార్పులు చేయనున్నారు.
0 Comments