లోక్‌పాల్ హై ఎండ్ లగ్జరీ కార్లకోసం అన్వేషిస్తోంది. దీనికి సంబంధించి ప్రముఖ ఏజెన్సీల నుండి ఓపెన్ టెండర్లను ఆహ్వానిస్తోందన్న వార్త నెట్టింట తీవ్ర చర్చకు తెరతీసింది.అక్టోబర్ 16న జారీ చేసిన నోటిఫికేషన్‌లో లోక్‌పాల్ 7 బీఎండబ్ల్యూ లగ్జరీ కార్లను కోరుకుంటోంది. వాటి ధర ఒక్కొక్కటి రూ. 70 లక్షలు. బీఎండబ్ల్యూ 3 సిరీస్ Li కార్లను ఏడింటిని కొనుగోలు చేయడానికి టెండర్‌ను పిలిచింది, ఛైర్‌పర్సన్, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అజయ్ మాణిక్‌రావ్ ఖాన్విల్కర్‌తో సహా ప్రతి సభ్యునికి ఒకటి చొప్పున వీటిని కేటాయించనున్నారు. అంతేకాదు కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ లోక్‌పాల్ డ్రైవర్లు ,సిబ్బందికి ఏడు రోజుల 'శిక్షణ' అందించనుంది. ఈ శిక్షణలో కార్ల ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లు కార్యకలాపాలపై వారికి ట్రెయినింగి కూడా ఇవ్వాలట. టెండర్ నోటీసు ప్రారంభ తేదీ నుండి 90 రోజుల వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ఆన్‌లైన్‌లోఆగ్రహాన్ని రేకెత్తించింది. విలాసాలతో లోక్‌పాల్ ప్రతిష్టను మంటగలుపు తున్నారంటూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మండిపడ్డారు. ఒకపుడు జవాబుదారీతనానికి చిహ్నంగా ఉన్న లోక్‌పాల్ గౌరవం దిగజారుతోందని, సంస్థలో కీలక నియామకాలు చేపట్టలేని ప్రభుత్వం విలాసవంతమైన విదేశీ కార్లను ఎందుకు కొనుగోలు చేస్తోందని యూత్ కాంగ్రెస్ విభాగం విమర్శలు గుప్పించింది. ఇది సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇపుడు ఒక్కొక్కిరికీ రూ. 70 లక్షల విలువైన కారు. తరువాత రూ. 12 కోట్ల విలువైన రోల్స్ రాయిస్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు అంటూ సెటైర్లు వేశారు.
0 Comments