అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వైఖరితో దేశం నాశనం అయ్యేలా ఉందని అమెరికన్లు భయపడుతున్నారు. నువ్వు రారాజువి కాదు సామాన్యుడివని గుర్తు చేస్తూ ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అమెరికా అధ్యక్షుడు సొంత ప్రజలపైనే బురద జల్లుతున్నారు. అంతా నా ఇష్టమన్నట్లు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారు. ప్రపంచదేశాలపై టారిఫ్‌ల నుంచి కీలక రంగాలకు నిధులకోత దాకా, ట్రంప్ ఒంటెద్దు పోకడపై అమెరికన్లు మండిపడుతున్నారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తున్నారు. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, చికాగో, లాస్ఏంజెలెస్ సహా మొత్తం 50 నగరాల్లో భారీ నిరసనలు జరిగాయి. అమెరికాలోనే కాదు.. ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా కెనడా, బెర్లిన్, రోమ్, పారిస్, స్వీడన్‌లోని యూఎస్ రాయబార కార్యాలయాల బయట కూడా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. రెండోసారి అధికారంలోరి వచ్చాక వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్.. విశ్వవిద్యాలయాలకు నిధులు తగ్గించడం, అనేక రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్ దళాలను మోహరించడం వంటి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ట్రంప్ నిర్ణయాలతో సంక్షోభం తలెత్తేలా ఉందని అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. అమెరికన్ల నిరసనలకు డెమోక్రాట్లతో పాటు పలు సంఘాలు, ప్రముఖ వ్యక్తుల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఇవి హేట్ అమెరికా నిరసనలంటూ అధికార రిపబ్లికన్ పార్టీ ఫైరవుతోంది. ఓ వైపు నో కింగ్స్ నిరసనలు జరుగుతుండగా ట్రంప్ రాజకీయ ప్రచార బృందం పోస్టు చేసిన వీడియో చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ రాజు దుస్తులు, కిరీటం ధరించిన్నట్లున్న ఏఐ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన ట్రంప్ నిరసనలకు దిగుతున్నవారిపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. తనకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న ప్రజలను వెక్కిరిస్తూ.. సోషల్ మీడియాలో ఏఐ వీడియోలను షేర్ చేశారు. డెమోక్రాట్లు కూడా తనముందు మోకరిల్లుతున్నట్లు వీడియోలను రిలీజ్ చేశారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ నిరంకుశ పాలనపై అమెరికాలో వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోంది. ఆయన సంస్కరణలు, వలస విధానాలు, భారీగా ఉద్యోగుల తొలగింపు వంటి చర్యలకు వ్యతిరేకంగా అమెరికన్లు అక్టోబర్ 18న దేశవ్యాప్తంగా నో కింగ్స్ పేరుతో భారీ ఆందోళనలకు పిలుపునిచ్చారు. దాదాపు 2500 ప్రాంతాల్లో జరిగిన ఈ నిరసనలకు యూరప్ దేశాల నుంచి కూడా మద్దతు లభించింది. పాలనా సంస్కరణల పేరుతో ట్రంప్ యంత్రాంగం వేలమంది ఉద్యోగులను తొలగించింది. పౌరసత్వం, ట్రాన్స్‌జెండర్ల రక్షణ, అక్రమ వలసల వంటి కీలక అంశాలపై ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌లోకి వెళ్లిపోవడం.. మూడు వారాలుగా అమెరికాలో అనేక సేవలు నిలిచిపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇదే తరహా నిరసనలు ఈ ఏడాది జూన్‌లోనూ జరిగాయి. తాజా నిరసనలతో కొన్ని రాష్ట్రాల గవర్నర్లు ముందు జాగ్రత్తగా జాతీయ బలగాలను మోహరించారు.
0 Comments