సౌతాఫ్రికాతో కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ డక్ వర్త్ లూయిస్ పద్దతిన 150 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 40 ఓవర్లలో 9 వికెట్లకు 312 పరుగులు చేసింది. కెప్టెన్ లౌరా వోల్వార్డ్ (82 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 90), సున్ లూస్ (59 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61), మరజన్నే కాప్(43 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో సదియా ఇక్బాల్(3/63), నష్రా సంధు(3/45) మూడేసి వికెట్లు తీయగా ఫతిమా సనా ఒక వికెట్ పడగొట్టింది. పాకిస్తాన్ బ్యాటింగ్ సమయంలో మరోసారి వర్షం అంతరాయం కలిగించడంతో లక్ష్యాన్ని 20 ఓవర్లలో 234గా నిర్ణయించారు. పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 83 పరుగులే చేసి ఓటమిపాలైంది. సిద్రా నవాజ్(22 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచింది. సఫారీ బౌలర్లలో మరిజన్నే కాప్(3/20) మూడు వికెట్లు తీయగా.. షాంగేజ్(2/19) రెండు వికెట్లు పడగొట్టింది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టైటిల్ రేసు నుంచి పాకిస్తాన్ అధికారికంగా నిష్క్రమించింది. వరుస పరాజయాలతో లీగ్ దశలోనే ఇంటిదారిపట్టింది. ఆరు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లు ఫలితం తేలకపోగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది.
0 Comments