సాఫ్ట్‌వేర్ కార్యాలయాల్లో విరామ సమయాలంటే సహోద్యోగులతో సరదా సంభాషణలు, కలిసి భోజనం చేస్తూ అనుభవాలు పెంచుకునే అవకాశం ఒకప్పుడు ఉండేది. కానీ ప్రస్తుతం విరామ సమయాల్లో ఫోన్లను చూస్తూ గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 1990 దశకంలో బెంగళూరులోని ఇన్ఫోసిస్ క్యాంటీన్ లోపల తీసిన ఒక పాత వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో యువ నిపుణుల బృందం భోజనం చేస్తూ, ఉల్లాసంగా మాటామంతి చేస్తూ, నవ్వుతూ కనిపిస్తున్నారు. '1990లలో బెంగళూరులోని ఇన్ఫోసిస్ క్యాంటీన్ ఫుటేజ్. ఇందులో దాదాపు చాలామంది మల్టీ-మిలియనీర్లు అయ్యారు. ప్రస్తుతం వారు విదేశాల్లో స్థిరపడ్డారు' అనే క్యాప్షన్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఆ సమయంలో భారతదేశ సాంకేతిక విప్లవంలో తాము భాగమవుతున్నామన్న విషయం వారికి తెలియకపోయి ఉండవచ్చు. ఈ వీడియో మాజీ ఉద్యోగులు, ఐటీ ఎక్స్‌పర్ట్‌లతో సహా అనేక మందిని ఆకట్టుకుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ..'చాలా క్లాస్! వారు రిలాక్స్‌గా కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఫిట్‌గా, తెలివిగా ఉన్నారు. చేతిలో ఫోన్ కూడా లేదు. అవి నిజంగా గోల్డెన్ డేస్' అని ఒకరు రాశారు. మరొకరు 'కులం, మతం, లింగ వ్యత్యాసాలను పట్టించుకోని, సమాజంలో సానుకూలంగా ప్రభావితమైన క్యాంపస్' అని రాశారు.
0 Comments