నైరుతి రుతుపవనాలవల్ల వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రాన్ని మేఘాలు కమ్మేశాయి. బంగాళాఖాతంలో గంటకు 31 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఆ ప్రభావం తెలంగాణలో ఉంది. ఇక్కడ గంటకు 10 కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత అధికంగా పెరగబోతోందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. కొన్నిరోజులుగా రాష్ట్రంలో పొగమంచు ఎక్కువగా ఉంది. ఇప్పుడు చలితీవ్రత కూడా పెరిగితే మంచు అధికమయ్యే అవకాశం ఉంది. పగటివేళ ఎండ ఎక్కువగా ఉండటం, రాత్రివేళ చలి ఎక్కువగా ఉండటం జరుగుతుందని అధికారులు తెలిపారు. పగలు ప్రస్తుతం 29 డిగ్రీలు నమోదవుతుండగా, రాత్రివేళ 19 డిగ్రీలు నమోదవుతోంది. వర్షాలకు సంబంధించి ఎటువంటి హెచ్చరికలు లేకపోయినప్పటికీ గాలిలో తేమ శాతం మాత్రం 40 నుంచి 50 వరకు ఉంటోందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు చలి బారిన పడకుండా ఉండేందుకు అనేకరకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శ్రీలంక తూర్పువైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోందని, దీంతో చలిగాలులన్నీ అటువైపు మళ్లే అవకాశం ఉందన్నారు. పగటివేళ ఎండ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఆ ఎండలో కనీసం 10 నిముషాలు ఉండాలని, వాకింగ్ చేయాలని, ప్రతి ఒక్కరు గోరువెచ్చిన నీరు తాగాలని, జలుబు, దగ్గు లాంటివి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో జలు ప్రారంభమై తర్వాత అది న్యూమోనియా, ఫ్లూ లాంటివాటికి దారితీస్తాయని, ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి దగ్గు ఎక్కువవుతుందని, 65 సంవత్సరాల వయసు దాటినవారు, రెండు సంవత్సరాల్లోపు చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఆస్తమా, గుండెజబ్బులతోపాటు కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తినట్లు అనిపించినా వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలని వాతావరణశాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు.
0 Comments