ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. వర్షం కారణంగా తొలి రోజు 13.2 ఓవర్ల ఆట సాధ్యమవ్వగా, రెండో రోజు ఆటలో ఎలాంటి ఆటంకం కలగలేదు. దాంతో 87.4 ఓవర్ల ఆట సాధ్యమైంది. రెండో రోజు ఆటలో వర్షం ఒక్కసారి కూడా రాలేదు. కానీ మూడో రోజు ఆటకు వరణుడు మళ్లీ అంతరాయం కలిగిస్తున్నాడు. దాగుడు మూతలు ఆడుతూ ఆటగాళ్లకు చికాకు తెప్పిస్తున్నాడు. మూడో రోజు ఆటలో వర్షం ఐదు సార్లు అంతరాయం కలిగించింది. వర్షం వస్తూ పోతుండటంతో ఆటగాళ్లు మైదానం, డ్రెస్సింగ్ రూమ్‌లోకి పరుగెడుతున్నారు. తొలి ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత బ్యాటర్లు ఇబ్బందికి గురవుతున్నారు. ఓ షాట్ కొట్టి టచ్‌లోకి రాగానే వర్షం రావడం, మళ్లీ ఫ్రెష్‌గా వచ్చి ఆడాల్సి రావడంతో తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. టీమిండియా టాప్-4 బ్యాటర్లు యశస్వి జైస్వాల్ (4), శుభ్‌మన్ గిల్ (1), విరాట్ కోహ్లీ (3), రిషభ్ పంత్ (9) దారుణంగా విఫలమైన వేళ కేఎల్ రాహుల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. క్లాసిక్ కవర్ డ్రైవ్స్‌తో పరుగులు రాబడుతున్నాడు. మిచెల్ స్టార్క్ వేసిన 15వ ఓవర్ తొలి బంతిని రాహుల్ అద్భుతమైన కవర్ డ్రైవ్ ఆడి బౌండరీ రాబట్టాడు. ఆ వెంటనే వర్షం రావడంతో రాహుల్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. అతను ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫొటోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. 'ఏందిరా ఈ గోస'అన్నట్లు రాహుల్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడని పేర్కొంటున్నారు. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ 14.1 ఓవర్లలో 4 వికెట్లకు 48 పరుగులే చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(30 బ్యాటింగ్)తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ(0) ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టీవ్ స్మిత్ (190 బంతుల్లో 12 ఫోర్లతో 101), ట్రావిస్ హెడ్ (160 బంతుల్లో 18 ఫోర్లతో 152) సెంచరీలతో చెలరేగారు. అలెక్స్ క్యారీ (88 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(6/76) ఆరు వికెట్లతో సత్తా చాటగా.. సిరాజ్ (2/97) రెండు వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ దీప్, నితీష్ కుమార్ రెడ్డి చెరో వికెట్ తీసారు.
0 Comments