తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడుతూ "పసలేని కేసులు పనికిమాలిన కేసులను ప్రభుత్వం పెడుతుంది. అవినీతి జరగనే లేనప్పుడు అవినీతి నిరోధక శాఖ పేరుతో కేసులు పెడుతుంది. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొంటాం. ప్రభుత్వం తమ అధికార యంత్రాంగం చేతిలో ఉందని అడ్డగోలుగా కేసులు పెట్టినా ఎదుర్కొంటాం. నేను మొదటి రోజు చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నా ప్రభుత్వ నిర్ణయంగా ఒక మంత్రిగా నిర్ణయం తీసుకున్నా అదే మాటకు నేను కట్టుబడి ఉన్నాను. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన మాటల్లోనే అవినీతి జరగలేదని చెప్పారు. అవినీతి ఎక్కడ ఉందని ముఖ్యమంత్రినీ అడిగితే చెప్పలేని పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి ఫార్ములా-ఈ ప్రతినిధులతో కలిసిన ఫొటో బయట పెట్టడంతో ముఖ్యమంత్రి అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. సస్పెండ్ చేస్తాను, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటానని బెదిరిస్తున్నారు. వాళ్లతో జరిగిన సమావేశాన్ని ఒక సంవత్సరం పాటు దాచి ఉంచారు. వాళ్ల దగ్గర డబ్బులు తీసుకున్నారని అనుమానం ఉంది. ఫార్ములా-ఈ సంస్ధ అనుచిత లబ్ధి పొందింది అన్నది వాస్తవమైతే, వాళ్లపైనే ఎందుకు కేసు పెట్టలేదు? ముఖ్యమంత్రి 600 కోట్లు అంటూ అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడుతున్నారు. కాంట్రాక్టులను రద్దు చేసుకోలేము అని చెబుతున్న ముఖ్యమంత్రి, ఫార్ములా-ఈ ని ఏ విధంగా రద్దు చేసుకున్నారు?" అని కేటీఆర్ ప్రశ్నించారు. దీనికి ఏమన్నా క్యాబినెట్ అప్రూవల్ ఉందా? ప్రొసీజర్ పొరపాట్లు ఉంటే సంబంధిత సంస్థల దగ్గరికి వెళ్ళాలి కానీ అవినీతి కేసులు అని పెట్టడం వృధా. హైదరాబాద్ పేరు ప్రతిష్టలు, తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు హైదరాబాద్ నుంచి ఫార్ములా ఈ రేసు పోవద్దన్న ఉద్దేశంతోనే డబ్బులు కట్టాం. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్క రూపాయి అవినీతి కూడా అవకాశమే లేదు. ఒక పైసా అవినీతి జరగలేదు. కోర్టులో విచారణ జరుగుతోంది కాబట్టి ఈ అంశంలో మరిన్ని విషయాలు చెప్పలేను. ఏసిబి ఎఫ్ఐఆర్‌ని కొట్టివేయాలని హైకోర్టులో కేసు నమోదు చేశాను. అయితే ఇదే అంశం పైన ఈడీ ఏసీబీ ఆధారంగా కేసు నమోదు చేసింది. ఈడీ నోటీసులు వచ్చిన మాట వాస్తవమే. కానీ ఈ ఎఫ్ఐఆర్ హైకోర్టు కొట్టి వేస్తే ఏం జరుగుతుందో చూడాలి. ఇతర కేసుల్లో మాదిరి కాకుండా ఈ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఏం జరుగుతుందన్నది చూడాలి" అని కేటీఆర్ అన్నారు. "ఔటర్ రింగ్ రోడ్డు పైన ఆరోపణ చేస్తున్న ప్రభుత్వం వెంటనే ఔటర్ రింగ్ రోడ్ రిలీజ్ రద్దు చేయాలి. అవినీతి జరిగిందని ఆరోపించినప్పుడు ప్రభుత్వం లీజును ఎందుకు రద్దు చేయట్లేదో ముఖ్యమంత్రి చెప్పాలి. నాపైన ఇప్పటికే అనేక కేసులను రాష్ట్రవ్యాప్తంగా నమోదు చేసింది. రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేకసార్లు వివిధ రకాల కేసులు పెట్టి జైలుకు పంపాలని ప్రయత్నం చేశారు. అనేక రకాల అంశాలు లేవనెత్తుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారంలో నాకు డబ్బులు ఎట్లా వచ్చాయో చెప్పాలి. అనుమానాలపైన కేసులు ఉండవు కేవలం ఆధారాలపైనే కేసులు ఉంటాయి. రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్దాలనూ, అసత్యాలనూ మీడియా యధాతధంగా ప్రచురితం చేస్తోంది. అసెంబ్లీలో కూడా అబద్ధాలు మాట్లాడుతున్న నీచపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కూడా రాష్ట్ర అప్పుల పైన ఒక్కొక్క అబద్ధాన్నీ అసెంబ్లీలో మాట్లాడారు. రేవంత్ రెడ్డికి కాదు రేవంత్ రెడ్డి తాతకు కూడా భయపడను" అని కేటీఆర్ అన్నారు.
0 Comments