Ad Code

39 మందితో కొలువుదీరిన మహారాష్ట్ర ప్రభుత్వం !


హారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన పది రోజుల తర్వాత పూర్తిస్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. మహాయుతిలోని మూడు పార్టీలకు చెందిన పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. నాగ్‌పుర్‌లోని రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ వీరితో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, ఉపముఖ్యమంత్రులు ఏక్‌నాథ్‌ షిండే, అజిత్‌ పవార్‌ల సమక్షంలో మూడు పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌ బావాన్‌కులేతోపాటు రాధాకృష్ణ విఖే పాటిల్‌, చంద్రకాంత్‌ పాటిల్‌, గిరీశ్‌ మహాజన్‌, గణేశ్‌ నాయక్‌, మంగళ్‌ప్రభాత్‌ లోధా, జయ్‌కుమార్‌ రావల్‌, పంకజ ముండే, అతుల్‌ సావే, అశోక్‌ ఉయికే, ఆశిశ్‌ శేలార్‌, శివేంద్రసిన్హ భోసలే, జయ్‌కుమార్‌ గోరె మంత్రులుగా ప్రమాణం చేశారు. శివసేన నుంచి గులాబ్‌రావ్‌ పాటిల్‌, దాదా భూసే, సంజయ్‌ రాథోడ్‌, ఉదయ్‌ సామంత్‌, శంభూరాజ్‌ దేశాయ్‌, ఎన్‌సీపీ నుంచి ధనంజయ్‌ ముండే, హసన్‌ ముష్రిఫ్‌, దత్తత్రేయ భార్నే, అధితీ తాత్కరే, మానిక్‌రావ్‌ కొకాటే, నరహరి జిర్వాల్‌ తదితరులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఉన్నారు. మహారాష్ట్రలో వరుసగా రెండోసారి 'మహాయుతి' ప్రభుత్వం డిసెంబర్‌ 5నే కొలువుదీరింది. భాజపా శాసనసభాపక్ష నాయకుడు దేవేంద్ర ఫడణవీస్‌ రాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. శివసేన అధినేత ఏక్‌నాథ్‌ శిందే, ఎన్సీపీ అగ్రనేత అజిత్‌ పవార్‌లకు ఉప ముఖ్యమంత్రుల హోదా కల్పించారు. ఫడణవీస్‌ మహారాష్ట్ర సీఎంగా మూడోసారి బాధ్యతలు చేపట్టగా.. డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌ ఆరోసారి బాధ్యతలు చేపట్టడం గమనార్హం. ఇదిలాఉంటే, మహారాష్ట్ర మంత్రివర్గంలో గరిష్ఠంగా 43 మంది మంత్రులు ఉండవచ్చు. వీటిలో 20 భాజపాకు, 13 శివసేన, 10 ఎన్‌సీపీకి కేటాయించినట్లు సమాచారం. మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఈసారి నాగ్‌పుర్‌లోని రాజ్‌భవన్‌ వేదికైంది. మహారాష్ట్ర శీతాకాల రాజధానిగా ఉన్న నాగ్‌పుర్‌లో 33 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కార్యక్రమం నిర్వహించడం గమనార్హం. 1991లో సుధాకర్‌రావు నాయక్‌ ప్రభుత్వ హయాంలో కేబినెట్‌ విస్తరణ కార్యక్రమం ఇక్కడ జరిగింది. జూన్‌ 25, 1991 నుంచి ఫిబ్రవరి 22, 1993 వరకు మహారాష్ట్ర సీఎంగా నాయక్‌ కొనసాగారు.

Post a Comment

0 Comments

Close Menu