ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో కోర్టు ఆదేశాలతో ఓ ప్రార్థనా మందిరంలో సర్వే నిర్వహిస్తున్న క్రమంలో ఘర్షణలు తలెత్తాయి. స్థానికులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు యువకులు మరణించారు. ఈ ఘటనలో అనేక మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. న్యాయస్థానం ఆదేశాలతో సర్వే తలపెట్టిన బృందానికి స్థానికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యింది. వందలాది మంది స్థానికులు పోలీసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. పదుల సంఖ్యలో పోలీసులు, అధికారుల వాహనాలకు నిప్పంటించారు. దీంతో భారీ స్థాయిలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. టియర్‌గ్యాస్‌తోపాటు రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నామని, ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉందని యూపీ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
0 Comments