కేరళలో ప్రమాదంలో ఉన్న రోగులను తరలించేందుకు అంబులెన్స్‌ను అడ్డుకున్న ఓ కారు యజమానికి ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానా విధించారు. అంతేకాకుండా అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేసారు. ఈ ఘటనలో అతడికి రెండున్నర లక్షల రూపాయలు ఫైన్ వేశారు ట్రాఫిక్ పాలీసులు. డ్రైవర్ బాధ్యతారాహిత్యానికి పాల్పడినందుకు కేరళ పోలీసులు చేసిన పనికి వారికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కేరళలో రద్దీగా ఉండే రోడ్డుపై కారు వెళ్తోంది. ఆ కారు వెంబడే అంబులెన్స్ వస్తుంది. అయితే, లోపల రోగి పరిస్థితి కాస్త ఇబ్బందిగా ఉండడంతో అంబులెన్స్ డ్రైవర్ వేగంగా నడుపుతున్నాడు. ఆ సమయంలో అంబులెన్స్ సైరన్ మోగిస్తూనే ఉన్నాడు. సైరన్, హారన్ మోగుతున్నా సదరు కారు డ్రైవర్ వారికి దారి ఇవ్వలేదు. ఆ సమయంలో అంబులెన్సు ముందు భాగంలో కూర్చున్న వైద్య సిబ్బంది వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంబులెన్స్ డ్రైవర్ ను కూడా విచారించిన పోలీసులు వారు ఇచ్చిన సమాచారంతో కారును నడిపిన యజమాని ఇంటి వద్దకు వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు ఏకంగా రెండున్నర లక్షల జరిమానా విధించారు.
0 Comments