కులవివక్ష, కులవ్యవస్థ ఉన్నప్పుడు అసమానతలు కూడా ఎక్కువగా ఉంటాయని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఈరోజు సాయంత్రం నగరానికి వచ్చిన ఆయన బోయిన్‌పల్లి గాంధీ తత్వ చింతన కేంద్రంలో కులగణనపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ''దేశంలో కుల వ్యవస్థ, కుల వివక్ష ఉందని అంగీకరిద్దాం. నేను దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నానని ఆరోపణలు చేస్తున్నారు. దేశం గురించి నిజం చెబితే దేశాన్ని విభజించడమా? కులగణన ద్వారా దళితులు, ఓబీసీలు, మహిళల సంఖ్యపై స్పష్టత వస్తుంది. కులగణన తర్వాత ఎవరి దగ్గర ఎంత ఆర్థిక వనరులున్నాయో తెలుసుకుందాం. కులగణన చేస్తామని పార్లమెంట్‌లో స్పష్టంగా చెప్పాను. అలాగే రిజర్వేషన్ల పరిమితిని తీసేస్తాం'' అని రాహుల్ అన్నారు. రాష్ట్రంలో జరగబోయే కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. అయితే కులగణనలో ఏ ప్రశ్నలు అడగాలనేది అధికారులు నిర్ణయించకూడదని, సామాన్యులే నిర్ణయించాలని చెప్పారు. ఈ సమావేశంలో మేధావులు, బీసీ సంఘాలతో రాహుల్ ముఖాముఖిగా మాట్లాడారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి కులగణన ప్రారంభం కానుంది.
0 Comments