గత నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసిన డొనాల్డ్ ట్రంప్ గెలుపొందారు. ఈయన వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఈలోపే ఆయన తన ప్రభుత్వంలోని కీలక పదవుల్లో తన అనుయాయుల్ని నియమిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ విభాగంలో ప్రముఖ బిలియనీర్లు అయిన ఎలాన్ మస్క్‌ను, వివేక్ రామస్వామిని నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా అంతర్జాతీయ పెట్టుబడిదారుడు అయిన స్కాట్ బెసెంట్‌ను ట్రెజరీ సెక్రటరీగాను, కాంగ్రెస్ మహిళ లోరీ చావెజ్ డెరెమెర్‌ను లేబర్ సెక్రటరీగా, డాక్టర్ జానెట్ నెషీవాట్‌ను సర్జన్ జనరల్‌గా నియమించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అలాగే అడ్మినిస్ట్రేషన్ పదవుల్లో అలెక్స్ వాంగ్‌ను ప్రిన్సిపల్ డిప్యూటీ నేషనల్ సెక్రటరీ అడ్వైజర్‌గా, డాక్టర్ సెబాస్టియన్ గోర్కాను ఉగ్రవాద నిరోధక శాఖ సీనియర్ డైరెక్టర్‌గా ట్రంప్ శుక్రవారం ప్రకటించారు. మాజీ కాంగ్రెస్ సభ్యుడు డాక్టర్ డేవ్ వెల్డన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) డైరెక్టర్‌గా నామినేట్ అయ్యారు. ఎఫ్‌డిఎ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) కమిషనర్‌గా మార్టి మకారీ, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ సెక్రటరీగా స్కాట్ టర్నర్‌ను నియమించారు. యుఎస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ (ఓఎంబి) డైరెక్టర్‌గా రస్సెల్ థర్లో వోట్ నియమితులయ్యారు. అయితే అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసేముందు ఆయా స్థానాలకు నామినేషన్‌లు దాఖలు చేయాలి. ఈ నామినేషన్లను యుఎస్ సెనేట్ ధృవీకరిస్తుంది.
0 Comments