ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే మార్గాలపై దృష్టిపెట్టాలని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. జాయింట్ వెంచర్లలో వివాదాలు పరిష్కరించి ఆదాయం పెంచాలన్నారు. దీని కోసం ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. డిప్యూటీ సీఎం అధ్యక్షతన ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం సమావేశమైంది. మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్థిక, పురపాలక, రెవెన్యూ, పరిశ్రమలు, గృహనిర్మాణ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన పురపాలక, గృహనిర్మాణ, న్యాయశాఖల కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేయాలని భట్టి సూచించారు. సమస్యకు పరిష్కారం చూపేలా వారం రోజుల్లోగా ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. తమకు ప్రోత్సాహకాలు అందిస్తే నగరం విడిచి ఔటర్ రింగ్ రోడ్డు బయటకు వెళ్తామని కాలుష్యకారక పరిశ్రమల నిర్వాహకులు మంత్రివర్గ ఉపసంఘానికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో.. ఈ విజ్ఞప్తులు పరిశీలించి వారు ఓఆర్ఆర్ బయట పరిశ్రమలు స్థాపించుకునేలా సహకరించి, ప్రోత్సహించాలని ఉపముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్ నగరంలో జీరో కాలుష్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
0 Comments