ఉత్తరాఖండ్‌లో ప్రయాణీకులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో కనీసం 36 మంది వరకు మంది మృతి చెందారని విపత్తు నిర్వహణా అధికారి మీడియాకు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓవర్ లోడ్ కారణంగా బస్సు లోయలో పడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బస్సు పౌరీ నుంచి రాంనగర్ వైపు వస్తుండగా అల్మోరాలోని మార్చులా సమీపంలో 200 మీ.లోతు ఉన్న లోయలో పడింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. 22 మంది అక్కడిక్కడే మరణించగా, తీవ్రగాయాలైన ఓ వ్యక్తిని రామ్‌నగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించినట్లు అల్మోరా జిల్లా విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఒక చిన్న నది ప్రవహించడాన్ని వీడియోలో గమనించవచ్చు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నామని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను ఎయిర్‌లిఫ్ట్ చేయాలని సూచించారు. సంఘటనా స్థలంలో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
0 Comments