హైదరాబాద్ లోని కూకట్‌పల్లి కేంద్రంగా 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ పేరుతో బడా మోసానికి పాల్పడింది. రూ.300 కోట్లు కొల్లగొట్టి బోర్డు తిప్పేసింది. ఈ మోసంలో 3600 మంది బాధితులు చిక్కుకుపోయారు. తమ కంపెనీలో 8 లక్షల 8 వేల రూపాయలు కనీస పెట్టుబడిగా పెట్టి.. రెండు గుంటల స్థలాన్ని కొనుగోలు చేస్తే, 25 నెలల పాటు ప్రతి నెలా 4 శాతం చొప్పున అంటే నెలకు రూ.32 వేలు చెల్లిస్తామని జోరుగా ప్రచారం చేశారు. అంతేకాకుండా ఈ స్కీమ్‌లో మరెవరినైనా చేర్పించినా వారికి 25 నెలల పాటు ప్రతి నెలా రూ.7200 చొప్పున చెల్లిస్తామని 12 వెల్త్ సంస్థ ఆశ చూపింది. అలాగే డబుల్ గోల్డ్ స్కీమ్‌లో కనీసం రూ.4 లక్షలు పెట్టుబడి పెడితే 12 నెలల తరువాత రూ.8 లక్షల విలువ చేసే స్విట్జర్లాండ్ గోల్డ్ బిస్కెట్ ఇస్తామని ట్రాప్ చేశారు. అంతేకాకుండా గోల్డ్ చిట్ స్కీమ్ పేరుతో మరో వల వేశారు. 5 లక్షల రూపాయలను 20 నెలల పాటు పెట్టుబడిగా పెడితే 19 నెలల పాటు నెలకు 15 వేల చొప్పున ప్రతి నెలా చెల్లిస్తామని, 20వ నెల మరో 15 వేలు అదనంగా చెల్లిస్తామని నమ్మించారు. ఈ క్రమంలో 3600 మంది బాధితులు పెట్టుబడి పెట్టి మోసపోయారు. తాము మోసపోయామని తెలుసుకుని బాధితులు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రై.లి. ఎండీ కలిదిండి పవన్ కుమార్ సహా మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 12 వెల్త్ అనుచరులు కొందరు అరాచకాలకు దిగారు. పోలీసులను ఆశ్రయించిన బాధితులను భయాందోళనకు గురి చేస్తూ అరాచకాలు చేశారు. కంప్లైంట్ చేస్తే డబ్బులు ఇవ్వమంటూ బెదిరించారు. ప్రస్తుతం వల్లభనేని రవికుమార్ చౌదరి, కాకర్ల గిరిబాబు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
0 Comments